కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కనిపించకుండా పోయాడన్న ఆవేదనతో ఓ తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కోసం గాలిస్తున్న బంధువులకు అదే బావిలో కొడుకు కూడా శవమై కనిపించడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య, సరిత దంపతుల కుమారుడు కన్నయ్య (11) శనివారం ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు.
తల్లిదండ్రులు బాలుడి కోసం ఊర్లో గాలించి, బంధువులను ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అదే రోజు రాత్రి బంధువుల ఇంటికి వెళ్లారు. తర్వాత తిరిగి వచ్చిన యాదయ్య రెండు రోజులైనా కొడుకు ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య కోసం గాలిస్తూ బంధువులు బావిలో శవాన్ని గుర్తించారు. యాదయ్య మృతదేహాన్ని బావిలో నుంచి తీస్తుండగా అదే బావిలో కన్నయ్య కూడా శవమై తేలడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తండ్రీకొడుకుల మృతితో సంతాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
Read Also: పాక్ ఎన్ని ముక్కలు అవుతుందో.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
Follow Us On: Facebook

