బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు ఎక్కడివి?: రామ్‌చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు ఎక్కడివి? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం చేతకాకపోతే తప్పుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబ సమస్యను రాజకీయంగా వాడుకుని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు‌‌ డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత తప్పు చేసినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారుగా అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్లు వేశారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన కుటుంబీకులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలుంటాయని అయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామ్‌చందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇంధన వినియోగంలో ప్రజలందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని రామ్ చందర్ రావు పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రధాని మోదీ ఇచ్చే ప్రతి పిలుపు ఒక బృహత్తర ప్రయోజనం కోసమేనని చెప్పారు. అందులో భాగమే ఈ ‘మేరా భారత్ – మేరా యోగ్దాన్’ (నా దేశం – నా వంతు పాత్ర) నినాదంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఇది కేవలం ఫోటోల కోసమో, పబ్లిసిటీ కోసమో చేసేది కాదని.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. తాను స్వయంగా మెట్రోలో ప్రయాణించడంతో పాటు, ఎలక్ట్రిక్ కారును వినియోగిస్తున్నానని చెప్పారు. కార్యకర్తలు కూడా దీనిని ఆచరించాలని కోరారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమంలో భాగంగ ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరు మీద ఒక మొక్కను తప్పకుండా నాటాలని కోరారు.

అంతకముందు పార్టీ కార్యాలయానికి రామ్‌చందర్​ రావు ఎలక్ట్రిక్ వాహనంలో వచ్చారు. ప్రధాని మోదీ పిలుపుతో మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మోదీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసుకోనుండటంతో నిర్వహించే కార్యక్రమాలపై సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ఎలక్ట్రిక్ వాహనంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈవీపై వచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>