కలం, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని అసెంబ్లీ వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ రోజైనా వచ్చి, తన ఛాలెంజ్ స్వీకరిస్తారేమోనని చూస్తున్నట్లు ఎక్స్‌లో మిస్టర్ బీన్ ఫన్నీ మీమ్‌తో పోస్ట్ చేశారు. మరోవైపు లోకేశ్ రాజీనామా చేయాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్సీలు మండలి బయట బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. డీఎస్సీలో క్రీడా కోటాలో భారీ అక్రమాలు జరిగాయని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..
మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. 25 వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు జనాభా లెక్కల జరగనుందని, అప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్రం చెప్పిందన్నారు. ఆ తరువాతనే కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు గురించి ఆలోచిస్తామన్నారు.

