Mobile Popup Ad
Mobile Popup Ad

అకాల వర్షం, తీరని కష్టం.. రోడ్డెక్కుతున్న వరంగల్ రైతులు

కలం, వరంగల్ బ్యూరో: అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) చేపట్టపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు జనగామ జిల్లాల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడుస్తుండటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపుగా అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలో కురిసిన వర్షాలతో కేసముద్రం, నర్సంపేట, నెక్కొండ, జనగామ మార్కెట్లలో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

రోడ్డెక్కుతున్న రైతులు

ధాన్యంతోపాటు మొక్కజొన్న కొనుగోళ్లు కూడా జరగకపోవడంతో మక్క రైతులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ధాన్యంతోపాటు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా మహబూబాబాద్, వరంగల్ (Warangal), జనగామ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల నర్సంపేట పరిధిలోని నల్లబెల్లిలో రైతులు మక్కలు దహనం చేసి నిరసన తెలిపారు. నెక్కొండ మండలం పనికర గ్రామంలో రైతులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. రాయపర్తి మండలంలో రైతులు ఖమ్మం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. సోమవారం కూడా జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నాకు దిగి, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తుమ్మల ఆదేశాలతో

ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల హనుమకొండలో నిర్వహించిన రైతుమేళా వేదికగా రైతుల సమస్యలపై స్పందించారు. లేబర్ కొరత, గోనె సంచుల సమస్య ఉందన్నారు. గోనె సంచులు బెంగాల్ నుంచే రావాల్సి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అయినా ధాన్యం కొనుగోళ్లలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులు కొంతమేర ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

Read Also: ముంచుకొస్తున్న ముప్పు.. ప్రధాని అప్పీల్ మర్మమేంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>