కలం, వెబ్‌డెస్క్: నీట్-2026 (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నీట్ అనేది ఇప్పుడు ఒక పరీక్షలా లేదని, అది ఒక వేలం పాటలా మారిందని విమర్శించారు. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు అమ్ముడుపోయాయని ఆరోపించారు. ఏడాది పొడవునా రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చదివిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఒక్క రాత్రిలో మార్కెట్‌లో వేలం వేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 89 సార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, 48 సార్లు రీ ఎగ్జామ్ నిర్వహించారని రాహుల్ గుర్తు చేశారు. ప్రతి సారి మాటలు చెప్పడం తప్ప మార్పు రావడం లేదని మండిపడ్డారు.
ఇక ఈ వ్యవహారంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన బిల్లును ప్రజలపై రుద్దినప్పుడల్లా అందులో పేద పిల్లల భవిష్యత్తు కూడా బలి అయిపోతోందని వ్యాఖ్యానించారు. 22 లక్షల మంది విద్యార్థుల నమ్మకాన్ని మోదీ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. భారత యువత కలలకు ఈ ప్రభుత్వం కంటే పెద్ద ముప్పు మరొకటి లేదని విమర్శించారు. కష్టకాలంలో ఉన్న దేశ యువతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉండదని, దాన్ని మారుద్దామని పిలుపునిచ్చారు. దేశంలోని యువత హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

