కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలో ఓ మహిళ మర్చిపోయిన రూ.20,000 నగదుతో కూడిన బ్యాగును నిజాయితీ గల ఆటో డ్రైవర్ (Auto Driver), అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) కలిసి క్షేమంగా తిరిగి అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం నగరానికి వచ్చారు. ఆమె పాత బస్టాండ్ నుండి శ్రీ చక్ర హాస్పిటల్ వరకు TS 04 UA 4697 నంబర్ గల ఆటోలో ప్రయాణించారు. అయితే ఆసుపత్రికి చేరిన తర్వాత తన బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయినట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, ట్రాఫిక్ పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు.
పాత బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వివరాలు సేకరించి సంబంధిత డ్రైవర్‌ను గుర్తించారు. సమాచారం అందుకున్న ఆటో డ్రైవర్ ఎలాంటి ఆలస్యం చేయకుండా బ్యాగును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో ఆ బ్యాగును బాధితురాలికి అందజేశారు. తన కష్టార్జితం తిరిగి దక్కడంతో మంజుల ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. నగదును తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ నిజాయితీని, వేగంగా స్పందించిన ట్రాఫిక్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉన్నప్పుడే సామాన్యులకు భద్రత ఉంటుందని ఆయన కొనియాడారు.

