కలం, వెబ్ డెస్క్: ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open)లో భారత సింగిల్స్ విభాగం ప్రయాణం ముగిసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu), యువ ఆటగాడు ఆయుష్ శెట్టి (Aayush Shetty) ప్రీక్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలవడంతో సింగిల్స్‌లో భారత సవాల్‌కు తెరపడింది. అయితే పురుషుల డబుల్స్‌లో హరిహరన్ ఆమ్సకరుణన్ – రూబన్ కుమార్ రేథినసబాపతి అర్జున్ జోడీ క్వార్టర్ ఫైనల్ చేరి భారత ఆశలను నిలబెట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్-16లో సింధు ప్రపంచ నంబర్-1 ఆన్ సె యంగ్‌తో తలపడింది. తొలి గేమ్‌లో కొంతసేపు పోటాపోటీగా ఆడిన సింధు, తన దూకుడు ఆటతో ఆకట్టుకుంది. అయితే కీలక సమయాల్లో ఆన్ సె యంగ్ మెరుగైన ఆట ప్రదర్శించింది. దీంతో ఆమె 21-17, 21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
సింధు నిష్క్రమణ తర్వాత భారత సింగిల్స్ ఆశలు యువ ఆటగాడు ఆయుష్ శెట్టిపైనే నిలిచాయి. హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియూతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ అద్భుతంగా ఆరంభించాడు. తొలి గేమ్‌ను 21-16తో గెలిచి ఆధిక్యం సాధించాడు. అయితే రెండో గేమ్‌లో లీ తన ఆటను మరింత మెరుగుపరుచుకుని 21-13తో గెలిచాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. చివరి గేమ్‌లో కూడా ఆయుష్ మంచి ఆరంభం చేసినా, అనుభవజ్ఞుడైన లీ వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించాడు. చివరకు 16-21, 21-13, 21-14తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఈ ఫలితంతో జకార్తాలో భారత సింగిల్స్ విభాగం ప్రయాణం పూర్తిగా ముగిసింది. అంతకుముందే లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. అయితే డబుల్స్ విభాగంలో భారత్‌కు శుభవార్త అందింది. హరిహరన్ – అర్జున్ జోడీ పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన ఏ. తై, కె. ఎక్స్. కాంగ్ జోడీపై పోరాడి విజయం సాధించింది. తొలి గేమ్‌ను 16-21తో కోల్పోయిన భారత జోడీ, రెండో గేమ్‌లో 21-15తో బలంగా పుంజుకుంది.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఉత్కంఠభరిత పోరులో 21-19తో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ విజయంతో సూపర్-1000 టోర్నీలో భారత్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి పూర్తిగా డబుల్స్ విభాగంపైనే నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో హరిహరన్ – అర్జున్ జోడీ మాజీ ప్రపంచ నంబర్-1 జోడీ గోహ్ స్జే ఫీ, నూర్ ఇజుద్దీన్ రుమ్సానీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది.

