Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రీ-ప్రైమరీ స్కూళ్లతో విద్యకు బలమైన పునాది : డీఈఓ ప్రశాంత్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో : 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో 22 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించగా, 2026–27 విద్యా సంవత్సరంలో మరో 58 ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్ (Karimnagar) జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులకు ఆటల ద్వారా, ఆనందభరిత వాతావరణంలో బోధన అందించి, వారి విద్యాభ్యాసానికి బలమైన పునాది వేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా బొమ్మలు, టెడ్డీ బేర్లు, విద్యా సంబంధిత ఆట వస్తువులు, ఆకర్షణీయమైన గోడ చిత్రాలు, గ్రీన్ మ్యాట్లు, గ్రీన్ బోర్డులు, ప్రత్యేక లెర్నింగ్ కార్నర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు, ఒక ఆయమ్మ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీటి ద్వారా చిన్నారుల్లో పాఠశాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ప్రాథమిక విద్యకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని తెలిపారు.

అలాగే తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం సరైన రీతిలో అమలు కావడానికి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. తల్లిదండ్రులు 3 సంవత్సరాలు నిండిన తమ పిల్లలను సమీప ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ప్రశాంత్ రెడ్డి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>