సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!

కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో (Asian Games) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మరో అడుగు ముందుకేసింది. మహిళల సింగిల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చియూ పిన్-చియాన్‌పై 21-19, 21-14తో గెలిచింది. దీంతో రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక దశలో సింధు 10-11తో వెనుకబడింది.

ఆ తర్వాత పుంజుకుంది. రెండు గేమ్ పాయింట్లు చేజారినా, మూడో గేమ్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకుని తొలి గేమ్‌ను 21-19తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు (PV Sindhu) మరింత జోరు పెంచింది. విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగించింది. చివరకు 21-14తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను ముగించింది. రౌండ్ ఆఫ్ 16లో సింధు జపాన్‌కు చెందిన టొమొకా మియాజాకితో తలపడనుంది.

ఈ మ్యాచ్‌ శనివారమే జరగనుంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా కూడా ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై 21-14, 20-22, 21-19తో విజయం సాధించింది. తదుపరి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్ధనితో తలపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి కూడా ముందంజ వేశాడు.

కజకిస్థాన్‌కు చెందిన మఖ్సుత్ తజిబుల్లాయెవ్‌పై 21-7, 21-7తో వరుస గేముల్లో గెలిచాడు. రౌండ్ ఆఫ్ 16లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెన్‌ను ఎదుర్కోనున్నాడు. అయితే భారత స్టార్ ల‌క్ష్యసేన్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. సింగపూర్‌కు చెందిన లోకీన్ యూపై 12-21, 21-15, 14-21తో ఓడిపోయాడు. దీంతో పురుషుల సింగిల్స్‌లో అతని పోరాటం ముగిసింది.

Also Read : సజ్జనార్ డ్యాన్స్.. ట్యాంక్‌ బండ్‌పై జోష్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>