కలం, వరంగల్ బ్యూరో: ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే ఉచితంగా మంజూరు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు.
ఇళ్లు కట్టుకుంటున్నవారికి ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని.. త్వరలోనే చివరి విడత బిల్లును కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు అడిగితే ఒక్కో ఇంటికి రూ.75 వేల చొప్పున ఇటీవలే రూ.2 లక్షల ఇళ్లకు డబ్బులు ఇచ్చిందన్నారు. జనగామ నియోజకవర్గంలోని సుమారు 500 గుడిసెల్లో ఉంటున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనన్నారు.
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన..
జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో రూ.38 కోట్లు సహా పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని జెండా ఊపి ప్రారంభించారు. 30 మంది శానిటరీ వర్కర్లు, 20 మంది డ్రైవర్లు సహా 54 మందికి నియామక పత్రాలు అందజేశారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం, బచ్చన్నపేట మండలం కట్కూర్ జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.
పోచన్నపేట, రామచంద్రపురం ఎంపీపీఎస్ పాఠశాలలు, జనగామ కోర్టు సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు)లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జడ్పీహెచ్ఎస్ (బాలికలు)లో అవుట్ డోర్ బాస్కెట్ బాల్ కోర్టుల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, వైస్ ఛైర్మన్ భూష పర్వతాలు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

