బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. హసీనా మద్దతుదారులు రోడ్లపైకి చేరుకుని నిరసనలు తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో హింస చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్ల సందర్భంగా ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఢాకా సహా పలు నగరాల్లో రవాణా, వ్యాపారాలు స్థంభించిపోయాయి. ఐసీటీ తీర్పును వ్యతిరేకిస్తూ అవామీ లీగ్ రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేసి, ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించింది.
హసీనా(Sheikh Hasina) తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాస ప్రాంతం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. నిరసనకారులు రహదారులను దిగ్బంధించి.. దుకాణాలు, నివాసాలపై రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
హసీనా వ్యాఖ్యలు దేశంలో హింస, అశాంతి రెచ్చగొడుతున్నాయని.. ఆమె వీడియోలను ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా ఏ వేదికలోనూ ప్రసారం చేయొద్దని ప్రభుత్వం ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సైబర్ భద్రతా ఆర్డినెన్స్ ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది.
గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల తీవ్రత పెరగడంతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలగారు. అనంతరం భారత్ వచ్చారు. ప్రస్తుతం ఆమె మనదేశంలోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. కోర్టు తీర్పుపై హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది రాజకీయ కుట్ర. ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయం” అని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయంగా శిక్ష పడేలా తాత్కాలిక ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా విస్తృత ఆందోళనలకు పిలుపునిచ్చారు.
Read Also: పటియాలా హౌస్‌కు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్
Follow Us on: Youtube

