ఢిల్లీ ఎర్రకోట శివార్లలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ క్రమంలో మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు జాసిర్ బిలాల్ అలియాస్ దానిష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) మంగళవారం పటియాలా హౌస్ కోర్టు(Patiala House court)లో హాజరుపరచనుంది. ఈ నేపథ్యంలో కోర్టులో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఈమెయిల్ ఒకటి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పటియాలా హౌస్, సాకేట్ జిల్లా కోర్టుల దగ్గర తనిఖీలు చేపట్టారు. జాసిర్‌ను తీసుకొస్తున్న క్రమంలో పటియాలా హౌస్ దగ్గర భద్రత కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) కూడా రంగంలోకి దిగింది. పటియాలా హౌస్ మొత్తాన్ని ఆర్ఏఎఫ్ మోహరించింది. పటియాలా హౌస్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను మరింత బలపరచారు.
అంతేకాకుండా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా అనుమానిత ప్రాంతాలన్నింటిలో తనిఖీలు చేస్తోంది. ఈ బెదిరింపుపై పటియాలా హౌస్(Patiala House court)లో సాకేత్ అండ్ ద్వారక కోర్ట్‌ల సెక్రటరీ అడ్వకేట్ తరుణ్ రానా స్పందించారు. ‘‘నాకున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని జిల్లాకోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కాగా పటియాలా హౌస్ సహా ఇతర కోర్ట్‌లకు వచ్చిన బెదిరింపులు ఉత్తిత్తివేనని తేలింది. ప్రస్తుతం భయపడాల్సిందేమీ లేదు. అదే విధంగా న్యాయస్థానాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి’’ అని ఆయన వెల్లడించారు.
Read Also: సోనియా బర్త్ డే ‘గిఫ్ట్’ సిద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us on : Pinterest

