epaper
Tuesday, November 18, 2025
epaper

విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలు.. 9 మంది దేవ్‌జీ బాడీగార్డుల అరెస్టు??

కలం డెస్క్ : మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సహా మొత్తం ఆరుగురు చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే విజయవాడ(Vijayawada) సమీపంలోని పెనమలూరు ఆటోనగర్‌ (కానూరు కొత్త ఆటోనగర్)లో 27 మందిని ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు ఒక భవనం నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఇందులో తొమ్మిది మంది మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి) ప్రొటెక్షన్ టీమ్ సభ్యులు (బాడీగార్డులు)గా గుర్తించారు. కాకినాడలో మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మొత్తం 31 మందిలో 21 మంది మహిళలని పేర్కొన్నారు. వీరంతా సౌత్ బస్తర్ ప్రాంతం నుంచి వచ్చినట్లు వివరించారు. అరెస్టయినవారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా నలుగురు ఉన్నట్లు ఆక్టోపస్ ఆపరేషన్‌లో పాల్గొన్నవారి నుంచి అందిన సమాచారం. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు కూడా 11 మంది, మిలిషియా సభ్యులు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. పెనమలూరు ఆటోనగర్ భవనం నుంచి అదుపులోకి తీసుకున్న 27 మందిని విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గిపోవడంతో అర్బన్ ప్రాంతంగా ఉన్న విజయవాడ నగరాన్ని, శివారు ప్రాంతాలను షెల్టర్ జోన్‌గా భావించి భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్సీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కూలీ పనుల కోసం వచ్చామనే పేరుతో ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నారని, వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని వివరాలను రాబడుతున్నట్లు తెలిపారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మాకు చెందిన కిట్ బ్యాగ్‌లో దొరికిన డైరీలో పెనమలూరు ఆటోనగర్‌లో షెల్టర్ ఉన్నట్లు సమాచారం లభించిందని, మరో నాలుగు చోట్ల ఆయుధాల డంప్‌లను నిర్వహిస్తున్న వివరాలు కూడా ఉన్నట్లు మహేశ్‌చంద్ర లడ్డా ద్వారా తెలిసింది. డైరీలలో సమాచారం వచ్చిన వెంటనే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించినట్లు జిల్లా పోలీసుల సమాచారం. కానీ చత్తీస్‌గడ్ పోలీసుల నుంచి అందిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగానే ఈ ఇంటిపై సోదాలు నిర్వహించి అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఆ భవనంలో మావోయిస్టులు తప్ప ఎవ్వరూ లేరు..

శివారు ప్రాంతంలో కొత్తగా కట్టిన ఈ భవనాన్ని మావోయిస్టులు అద్దెకు తీసుకోగా, మూడంతస్తుల భవనంలో వీరు తప్ప ఇంకెవరూ లేరని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఈ భవనం నుంచి 27 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఎస్ఎల్ఆర్ తదితర రైఫిళ్ళను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ భవనాన్ని తెలుగు మాట్లాడే ఓ మహిళ అద్దెకు తీసుకుని షెల్టర్ కల్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం. ఆపరేషన్ కగార్(Operation Kagar) అనంతరం అటవీ ప్రాంతాల్లోని దళాలపై నిఘా పెరగడం, కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం కావడంతో సివిల్ డ్రెస్సుల్లో విజయవాడ(Vijayawada)కు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిడ్మా డైరీ నుంచి ఈ వివరాలు లభించినందున ఆయన ఆదేశాల మేరకు, ఆయన కోఆర్డినేషన్‌తో ఇక్కడికి వచ్చి ఉంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆటోనగర్ పారిశ్రామికవాడ కావడంతో కూలీల రూపంలో ఎంటర్ అయ్యారని, వాచ్‌మాన్‌కు సైతం వర్కర్లుగా పనిచేస్తున్నట్లు నమ్మబలికారని పోలీసులు వివరించారు.

Read Also: హిడ్మాతో పాటు చనిపోయింది వీరే…

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>