ఇటీవల పాకిస్థాన్(Pakistan) తీసుకొచ్చిన 27వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం సింధ్ రాష్ట్రంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ సవరణ ప్రజాస్వామ్యానికి ప్రమాదమంటూ ప్రజలు నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో ఇటీవల 27వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ (పీఏటీ), దాని మహిళా విభాగం సింధియానీ తెహ్రీక్ (ఎస్‌టీ) ఆధ్వర్యంలో వేలాది మంది వీధుల్లో నిరసనలు తెలిపారు. సింధ్ వనరుల దోపిడీ, కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతో భూముల బదిలీ, సింధు నదిపై కొత్త కాలువల నిర్మాణం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తున్నాయి. సింధ్‌లోని జైల్ రోడ్ నుంచి స్థానిక ప్రెస్ క్లబ్ వరకు వేలాదిమంది పాల్గొన్న భారీ ర్యాలీ నిర్వహించారు. 27వ సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో మహిళల అధికసంఖ్యలో పాల్గొనడం గమనార్హం.
ఈ సందర్భంగా పీఏటీ అధ్యక్షుడు వసంద్ థారీ మాట్లాడుతూ.. ఈ సవరణ ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి అని ఆయన ఘాటుగా విమర్శించారు. సింధ్ ఖనిజాలు, నీటివనరులు, ఇతర సహజ వనరులను నియంత్రణ లేకుండా దోచుకునే అధికారం ఈ సవరణ పాలకులకు ఇస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతో లక్షల ఎకరాల పంట భూములను పెద్ద సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఇది రైతుల భూములను బలవంతంగా లాక్కొనడానికి దారి తీస్తుందని వసంద్ థారీ స్పష్టం చేశారు.
ర్యాలీ చివర్లో ఆందోళనకారులు పలు తీర్మానాలను ఆమోదించారు. 27వ సవరణ కింద అధ్యక్షుడికి, ఫీల్డ్ మార్షల్‌కు జీవితకాల రక్షణ కల్పించడం తీవ్రంగా ఖండించారు. ఇది వారిని చట్టానికి అతీతులుగా మార్చే ప్రమాదకర నిర్ణయమని, ఇలా చేస్తే దేశ ప్రజలు రాజ్యంలో జీవిస్తున్నట్టే అవుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. వనరుల దోపిడీకి చట్టబద్ధతను ఇచ్చేందుకు సవరణను వక్రీకరించి తీసుకువచ్చారని ఆందోళనకారులు ఆరోపించారు.
నవంబర్ 13న అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ వివాదాస్పద బిల్లుపై సంతకం చేయడంతో 27వ సవరణ అధికారికంగా చట్టమైంది. అంతకుముందే పార్లమెంట్‌లోని రెండు సభలు దీనికి ఆమోదం తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియను కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, పార్లమెంట్‌ను కేవలం ముద్రపోయే సంస్థగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక మరోవైపు ప్రధాన విపక్ష కూటమి ‘తహ్రీక్-ఇ-తహఫుజ్ అయీన్-ఇ-పాకిస్థాన్’ (టీటీఏఐపీ) కూడా ఈ సవరణను ఖండించింది. నవంబర్ 22న దేశవ్యాప్తంగా “బ్లాక్ డే” ను పాటించాలని పిలుపునిచ్చింది. రాజ్యాంగ సంరక్షణ పేరిట ప్రజల హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అంతర్గత భద్రతా సమస్యలు, సైనిక-పౌర అధికార పోరు వంటి అంశాలతో పాకిస్థాన్ పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో 27వ సవరణ మరింత రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ 27వ రాజ్యాంగ సవరణ
పాకిస్తాన్(Pakistan) పార్లమెంటు ఇటీవల 27వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ సవరణ ద్వారా దేశ న్యాయవ్యవస్థ, ముఖ్యంగా సుప్రీం కోర్టుపై ప్రభుత్వం, పార్లమెంటు అధికారాలు గణనీయంగా పెరిగాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు, పౌర సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. “న్యాయవ్యవస్థ స్వతంత్రానికి ముప్పు” అంటూ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక రాజ్యాంగ సవరణ ప్రకారం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నియామకం ఇకపై సీనియారిటీ ఆధారంగా కాకుండా, 12 మంది సభ్యుల పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తుంది. జడ్జిల పనితీరును కూడా పర్యవేక్షించే అధికారం ఉంది. జ్యుడీషియల్ కమిషన్‌లో ప్రభుత్వ ప్రతినిధుల ఆధిపత్యం పెరిగింది.హైకోర్టు జడ్జిల రిటైర్మెంట్ వయసు పెంచారు. . ప్రస్తుత చీఫ్ జస్టిస్ కాసిం ఫైయాజ్ ఈసా ఈ సవరణను “రాజ్యాంగ విరుద్ధం” అంటూ తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్ బార్ కౌన్సిల్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి.
Read Also: పాక్‌కు భారత సైన్యాధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us on: Youtube

