epaper
Monday, November 17, 2025
epaper

‘డిజిటల్ అరెస్ట్’తో రూ. 31 కోట్లకు టోకరా

కలం డెస్క్ : డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో ఒక మహిళా టెకీ నుంచి సైబర్ కేటుగాళ్ళు రూ. 31 కోట్లు దోచుకున్నారు. ఆరు నెలల పాటు వివిధ రకాలుగా ఆమెను మొబైల్ ఫోన్ సంభాషణలు, వీడియో కాల్స్ తో మభ్యపెట్టి, బెదిరించి సుమారు 60 బ్యాంక్ ఖాతాలకు రూ. 31 కోట్లను బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా ఫోన్ నెంబర్‌కు అందుబాటులో లేకుండా పరారయ్యారు. దేశంలోనే అతి పెద్ద సైబర్ ఫ్రాడ్‌గా కావచ్చని ముంబై ఈస్ట్ డివిజిన్ సైబర్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరు 15న మొదలైన సైబర్ కేటుగాళ్ళ మోసం వేర్వేరు రూపాల్లో ఈ ఏడాది మార్చి 26 వరకు కొనసాగినట్లు పోలీసులు వివరించారు. అనారోగ్య సమస్యలు, కొడుకు పెళ్ళి, ఫారిన్ ట్రిప్ తదితర కారణాలతో పాటు భయం, మానసిక ఆవేదన కూడా ఫిర్యాదు చేయడంలో జాప్యానికి కారణమైందని వివరించారు.

కొరియర్‌లో డ్రగ్స్ పేరుతో స్టార్ట్ :

డిహెచ్ఎల్ కంపెనీ ద్వారా ముంబైలోని అంధేరి సెంటర్‌కు ముఖ్యమైన కొరియర్ వచ్చిందని, అందులో మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ బెంగళూరులోని ఇందిరా నగర్‌కు చెందిన ఐటీ మహిళా ఎంప్లాయీని గతేడాది సెప్టెంబరు 15న ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్ళు ఆమెకు గుర్తు తెలియని నెంబర్ (unknown number) నుంచి ఫోన్ చేశారు. అందులో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ కూడా ఉన్నాయని నొక్కిచెప్పారు. ఈ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని ఆ మహిళ చెప్పినా వినకుండా ఆ కొరియర్ మీద మొబైల్ నెంబర్ ఉన్నందున సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు.

ఆ తర్వాత సీబీఐ నుంచి కాల్ చేస్తున్నామంటూ మరో వ్యక్తి ఫోన్ చేసి కుటుంబ సభ్యులెవరితోనూ ఈ విషయాన్ని షేర్ చేయవద్దని, ఒకవేళ బహిర్గతమైతే నిందితురాలిగా ఎఫ్ఐఆర్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న సీబీఐ ఆఫీసర్‌ను అంటూ పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెను వీడియో కాల్‌లో ఇంటరాగేట్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు వీడియో కాల్‌లోనే రకరకాల ప్రశ్నలతో ఆమెను విచారించినట్లు ముంబై ఈస్ట్ డివిజన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో బెంగళూరు మహిళా టెకీ పేర్కొన్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు రిజర్వు బ్యాంకు (RBI)లోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమె అన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. కొరియర్ పార్సిల్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నందున పోలీసు కేసు తప్పదంటూ ఆమెను డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వక తప్పదని బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె బ్యాంకు అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేయాల్సి ఉన్నందున, దానికంటే ముందే వాటిల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్, సేవింగ్స్.. ఇతర సొమ్ము మొత్తాన్ని బదిలీ చేయాల్సిందిగా కొన్ని బ్యాంకు అకౌంట్లను ఇచ్చి నమ్మించారు.

దర్యాప్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆ డబ్బు మళ్ళీ ఆ ఖాతాల్లోకి జమ అవుతుందని నమ్మబలికారు. ఆర్బీఐ అధికారిగా నమ్మిన ఆ మహిళా టెకీ మొత్తం సొమ్ము (దాదాపు రూ. 31.50 కోట్లు) బదిలీ చేశారు. చివరకు ఈ ఏడాది మార్చి 26 నుంచి ఆ వ్యక్తుల ఫోన్లన్నీ మూగపోయాయి. అనుమానం, ఆందోళన వెంటాడుతున్నా కొడుకు పెళ్ళి, అనారోగ్యానికి వైద్య చికిత్స, విదేశీ ప్రయాణం తదితరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని, ఇంతకాలం దాచుకున్న సొమ్మంతా దొంగలపాలైందని ఆ ఫిర్యాదులో ఆమె వాపోయారు. ఈ విషయాన్ని ముంబై ఈస్ట్ డివిజన్ మాజీ డీసీపీ దేవరాజ్ మీడియాకు వివరించారు.

Read Also: నా ఫ్యామిలీ మెంబర్‌కు సైబర్ షాక్ : అక్కినేని నాగార్జున

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>