కలం, వెబ్ డెస్క్: టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆర్పీఎస్-2021 హామీకి సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో రూ.1 కోటి చెక్కు అందజేయడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కేసులను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున చెక్కులు అందించినట్లు తెలిపారు.
ఆర్టీసీ పురోగతిపై చర్చ..
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2023-26 మధ్యకాలంలో ప్రజా పాలన ప్రభుత్వం రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని వివరించారు. మూలుగు జిల్లా ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవల స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
1,137 కారుణ్య నియామకాలు చేపట్టాం..
బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద మొత్తం 1,137 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. వీరిలో 888 మంది కండక్టర్లు, 10 మంది డ్రైవర్లు, 43 మంది శ్రామిక్‌లు, 196 మంది కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సీఎస్ఎస్ బకాయిలు రూ.1,096.90 కోట్ల నుంచి రూ.862 కోట్లకు తగ్గాయని అన్నారు. పీఎఫ్ బకాయిలు రూ.2,018.15 కోట్ల నుంచి రూ.1,714.39 కోట్లకు తగ్గాయని చెప్పారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలను కూడా రూ.493.02 కోట్ల మేర తగ్గించినట్లు వివరించారు.
ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలి..
పెండింగ్‌లో ఉన్న అర్హులైన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీసు నుంచి తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 244 మందిని విధుల్లోకి తీసుకున్నామని, మిగిలిన కేసులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. మహాలక్ష్మీ పథకం మహిళల ఆర్థిక సాధికారతపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసి ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను 553 బస్సులకు యజమానులుగా చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందిస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉండగా, ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి సుమారు 61 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

