ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలి.. టీఆర్‌పీ డిమాండ్

కలం, సూర్యాపేట: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీంతో మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని జానయ్య యాదవ్ (Janaiah Yadav) మండిపడ్డారు. అడ్డగోలు ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫారాలు, స్టేషనరీ సామాగ్రిని కూడా పాఠశాలల్లోనే కొనాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నిధులు గుంజుతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

పేద విద్యార్థుల కోసం రాజ్యాంగం కల్పించిన ‘విద్యాహక్కు చట్టం-2009’ ను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిపై తమ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు తక్షణమే ‘పేరెంట్స్ కమిటీ’లను, ‘పొలిటికల్ కమిటీ’లను ఏర్పాటు చేయాలని కోరారు. ఫీజుల దోపిడీపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల ముందు త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని జానయ్య యాదవ్ విమర్శించారు. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: కారులో ఉంచిన వాటర్ బాటిల్ నీళ్లు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఈ ప్రమాదాలు తప్పవు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>