Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

కలం, తెలంగాణ బ్యూరో: Congress Secret Survey | రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్‌లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత బహిర్గతం కాలేదు. దానికి తోడు ముందస్తుకు వెళ్లడంతో రెండోసారి ఆ పార్టీ పవర్‌లోకి వచ్చింది. కానీ, సెకండ్ టర్మ్‌లో మాత్రం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పార్టీ అధిష్టానానికి తెలిసినా.. పాతవాళ్లకే టికెట్లు ఇవ్వడంతో కేసీఆర్ సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

అలాంటి పరిస్థితి రావొద్దని.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇప్పటి నుంచే అలర్ట్ అయింది. పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెండున్నరేండ్ల పాలన పూర్తి కావడం.. మిగిలిన రెండున్నరేండ్లలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తూనే పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలకు తెలియకుండానే వారివారి నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వే (Secret Survey) చేయిస్తున్నది.

సొంత ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్‌పై పది రోజులుగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే (Congress Secret Survey) జరుగుతున్నది. త్వరలోనే మిగిలి జిల్లాల్లో కూడా చేపట్టేందుకు రెడీ అవుతున్నది. రిపోర్టు రాగానే.. దాని ఆధారంగా ఎమ్మెల్యేలకు స్పెషల్ క్లాసులు తీసుకునే చాన్స్ ఉంది. ఎమ్మెల్యేలకు, పార్టీకి ఉన్న బలం, బలహీనతలను సర్వే ద్వారా తెలుసుకొని ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండున్నరేండ్ల ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల పర్యటనలు, మాటల యుద్ధం జోరుగా సాగుతున్నది. మరోసారి అధికారం ఖాయమంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌దే అధికారమని ఆ పార్టీ లీడర్లు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈసారి ప్రభుత్వం తమదేనంటూ బీజేపీ ప్రకటనలు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోడానికి కాంగ్రెస్ సీక్రెట్ సర్వే చేయిస్తున్నది. థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది. దాదాపు పది రోజులుగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సర్వే సంస్థల ప్రతినిధులు సేకరిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు తెలియకుండానే..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు తన దగ్గర ఉన్నదంటూ సీఎం రేవంత్ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. కొద్దిమంది గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేదని, అవసరమైతే ఆ రిపోర్టును వారికి అందజేస్తానని ఓపెన్ కామెంట్ చేశారు. ప్రజలకు మరింత చేరువ కావాలని, నియోజకవర్గంలో విస్తృతంగా తిరగాలని, పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఆరు నెలలైనా కొద్దిమంది పనితీరు మెరుగుపడలేదని సీఎం గ్రహించారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో జమీందార్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొద్దిమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు తెలియకుండానే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో రహస్యంగా సర్వే జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే పది రోజులుగా జరుగుతున్నది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అభిప్రాయాల సేకరణ ముమ్మరంగా జరుగుతున్నది.

దిద్దుబాటు కోసమే..!

– బీఆర్ఎస్‌కు ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, 2034 వరకు తానే ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి, ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఆ ప్రభావం పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఏ మేరకు పడిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సీక్రెట్ సర్వే జరుగుతున్నది.
– ఎమ్మెల్యేలకు, పార్టీకి ఉన్న బలం, బలహీనతలను తెలుసుకోవడం ద్వారా ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం.
– సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నందున అది ఏ మేరకు పార్టీకి అనుకూలంగా ఉన్నది.. ఆ ఫలాలు అందుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యేల కారణంగా ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తున్నదా? అసంతృప్తి నెలకొన్నదా?.. ఇలాంటివాటిని సర్వే ద్వారా తెలుసుకుని పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించాలని పార్టీ భావిస్తున్నది. మిగిలిన జిల్లాల్లోనూ ఈ సర్వే కంటిన్యూ కానున్నది.

బీఆర్ఎస్ చేదు అనుభవం రిపీట్ కాకుండా..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్ములో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత బహిర్గతం కాలేదు. ఆ కారణంగా రెండోసారి పవర్‌లోకి వచ్చింది. పలు సంక్షేమ పథకాలు సెకండ్ టర్ము సందర్భంగా ఉనికిలోకి వచ్చినా ఎమ్మెల్యేల పనితీరు కారణంగా ఆ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా దీన్ని గమనంలోకి తీసుకుని పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత ప్రక్షాళనకు రెడీ అయింది.

ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వచ్చినట్లయితే, కారణమేంటి.. ఎమ్మెల్యేలు మార్చుకోవాల్సిన పనితీరు ఏంటి.. పథకాలు క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నాయా.. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటున్నారా… ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తున్నదా.. ఓవరాల్‌గా చక్కదిద్దుకోవాల్సిన అంశాలేంటి.. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా… ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు.. ఈ తరహాలో కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలతో సర్వే జరుగుతున్నది.

రిపోర్టులు రాగానే క్లాసులు!

– సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరుగుతున్న ఈ సర్వే తర్వాత ఏం జరగనున్నదనేది కీలకంగా మారింది. సగం పీరియడ్ ముగిసిపోవడంతో కాంగ్రెస్ చేయిస్తున్న సీక్రెట్ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది.
– పని తీరు మార్చుకోవడంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి కలిసి ప్రోగ్రెస్ రిపోర్టులో వెనకబడిన ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ నిర్వహించే అవకాశం ఉంది.
– ఏ ఎమ్మెల్యే పనితీరు భేషుగ్గా ఉన్నది.. సంతృప్తికరంగా ఉన్నది.. ఫర్వాలేదు.. బాగలేదు.. నచ్చలేదు.. ఇలాంటి సమాధానాలకు తగ్గట్టు రిపోర్టులోని అంశాలను ఎమ్మెల్యేలకు వివరించి పద్ధతి మార్చుకునేందుకు సమయం ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచన.
– ఎన్నికలకు ముందు మరోమారు ఇలాంటి సర్వే నిర్వహించి ఆ రిపోర్టు ఆధారంగా టికెట్పై పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలకు ప్లానింగ్ జరగడంతో రానున్న రోజుల్లో ఏయే నియోజకవర్గం మీద పార్టీ, ప్రభుత్వం ఫోకస్ పెట్టాలనేది ఖరారు కానుంది.

Read Also: ఎల్‌ నినో ముప్పు.. ఆ జిల్లాల్లో వానలు కష్టమే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>