కలం, వెబ్ డెస్క్: డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చిక్కుల్లో పడ్డారు. తంజావూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నటి త్రిషపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కావేరి జల వివాదంలో సీఎం విజయ్ తీరును తప్పుబట్టిన ఉదయనిధి.. ‘ఆయన రైతులకు నీరు రావాలని చూడటం లేదు.. త్రిష ఇంటికి రావాలని ఎదురు చూస్తున్నారు’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూ.. ఉదయనిధిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ కీలక నేత తమిళిసై సౌందర్ రాజన్ ఘాటుగా స్పందించారు. ‘ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణ, అసభ్యకర వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారు. కావేరి అంశం గురించి మాట్లాడాల్సింది పోయి, తోటి నటి గురించి మాట్లాడటం ఆయనకే చెల్లింది. డీఎంకే రాజకీయ విలువలు రోజురోజుకు ఘోరంగా పడిపోతున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న వారు మహిళల పట్ల గౌరవంగా మెలగడం నేర్చుకోవాలి. డీఎంకే నేతలు జైలుకు వెళ్లడం, అవినీతి చేయడం తప్ప చేసిందేమీ లేదు’ అని మండిపడ్డారు.

