ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత విస్మరించడం రాజకీయ పార్టీలకు షరామామూలే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. నిధుల కొరత, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం వంటి అనేక సవాళ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పదే పదే విపక్షాలు, మీడియా గుర్తు చేస్తూనే ఉన్నాయి. మహిళలకు నెలనెలకు 2500 రూపాయలు, పింఛన్లు నాలుగు వేలకు పెంపు, నిరుద్యోగ భృతి, కల్యాణ్ లక్ష్మి పథకం కింద తులం బంగారం వంటి కీలక హామీలు పదే పదే చర్చకు వస్తున్నాయి. అయితే తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చేసిన తులం బంగారం హామీపై చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయంలో తాము హామీ ఇచ్చిన సమయంలో తులం బంగారం కేవలం 50 వేలు మాత్రమే ఉందని.. అయితే ప్రస్తుతం లక్షా యాబైవేల దాకా వెళ్లిందని తాము ఈ హామీని ఎలా నెరవేర్చగలం అంటూ ఆయన ప్రశ్నించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
అనేక హామీలు
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అనేక హామీలు ఇచ్చింది. ‘కళ్యాణలక్ష్మి’ పథకంలో కూడా రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు, తులం బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్ష చెక్కులు ఇచ్చినా, తులం బంగారం విషయంలో ఎటువంటి అమలు లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇవ్వడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ఒప్పుకుంటున్నారు. గతంలో సీనియర్ నేత వీహెచ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, “కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు చూపించి ప్రజలను మోసం చేసింది. తులం బంగారం ఇవ్వకపోతే ఎలా అధికారంలో ఉంటారు?” అని ప్రశ్నించారు. ఇక్కడే కాకుండా, పలు జిల్లాల్లో మహిళలు “తులం బంగారం ఎప్పుడిస్తారు?” అని నిలదీస్తున్నారు. ఈ హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగిందని, రాబోయే ఉప ఎన్నికల్లో ఇది ప్రధాన కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదానికి ఎలా స్పందిస్తుంది? తులం బంగారం హామీని రద్దు చేసి, బదులుగా మరో ఆర్థిక సాయాన్ని ప్రకటించవచ్చా? లేదా ధర పెరుగుదలను కారణంగా చూపించి పూర్తిగా వదిలేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే తులం కాకుండా అర్ధతులం ఇచ్చినా ప్రజలు ఊరుకుంటారేమో. కానీ, ఈ హామీని మొత్తానికే పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ అపఖ్యాతిని మూటగట్టుకోక తప్పదు. ఇప్పటికే మహిళలకు ఇస్తామన్న 2500, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి తోడు మరో విమర్శ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని.. అందుకే తాము హామీలు నెరవేర్చలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ప్రజలు అర్థం చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వాదనతో ఏకీభవిస్తారా? అన్నది వేచి చూడాలి.
Read Also: మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం స్వాధీనం .. భద్రతా బలగాల భారీ ఆపరేషన్
Follow Us On : Instagram

