కలం, వెబ్ డెస్క్: రవాణా శాఖలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం రవాణా శాఖ (Transport Department) అధికారులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 2024-25లో రవాణా శాఖ రూ.6,910.90 కోట్లు ఆదాయం వసూలు కాగా.. 2025-26లో రూ.7,097.38 కోట్లు వసూలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈవీ పాలసీ ద్వారా రవాణా శాఖ ఆదాయం కొంతమేర తగ్గినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన టార్గెట్ చేరుకున్న లైఫ్ టాక్స్, త్రైమాసిక టాక్స్ వసూలులో మంచి పనితీరు కనబరచిన అధికారులను మంత్రి అభినందించారు. పలువురు అధికారులకు పనితీరు మెరుగు పరచుకోవాలన్నారు.
8 నెలల్లోనే దేశంలో తెలంగాణ నెం.1
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రభుత్వం రూపొందించిన ‘సారథి’ పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే దేశంలో తెలంగాణ నెం.1గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ – మహారాష్ట్ర, ఆదిలాబాద్ – మహారాష్ట్ర, మెదక్ – కర్ణాటక తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లైసెన్స్ ఇతర పౌర సేవలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖలో తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు పూర్తి చేసి ఇతర సమస్యలు కమిషనర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 13 నుండి నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్, రవాణా శాఖ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
అరైవ్-అలైవ్ విజయవంతం చేయాలి..
రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఆటోల ఓవర్ లోడ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ లేకపోవడం లాంటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని.. వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) సూచించారు. వాహన్ పోర్టల్ డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. జూన్ 1 కి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఏఎంవీఐ (AMVI)లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి రహవీర్ స్కీమ్, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 17 జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలను గుర్తించాలని సూచించారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Read Also: ఆఖరికి.. వాటర్ ప్యాకెట్స్ కూడా కల్తీనే!
Follow Us On : WhatsApp

