రాజకీయ పార్టీలకు విరాళాల్లో(Political Donations) పెరుగుదల నమోదైంది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్‌కు గతేడాదితో పోలిస్తే రెట్టింపు అందగా, ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకి ఊహించని స్థాయిలో విరాళాలు వచ్చిపడ్డాయి. అలాగే ఆప్, లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీలకు విరాళాల్లో పెరుగుదల కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ కు తగ్గాయి. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయా పార్టీలు వివరాలు వెల్లడించాయి. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ వివరాలు వెల్లడించలేదు.
కాంగ్రెస్ కు డబుల్..:
గతేడాది ఎలక్ట్రోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా పార్టీలకు అందుతున్న విరాళాల్లో పారదర్శకత లోపించిందని అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేవలం ఎలక్ట్రోరల్ ట్రస్ట్స్, కార్పొరేట్, వ్యక్తిగత రూపంలో మాత్రమే విరాళాలు పార్టీలకు అందుతున్నాయి. తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం గతేడాదితో పోలిస్తే కాంగ్రెస్ కు ఈసారి విరాళాల మొత్తం డబుల్ అయ్యింది. నిరుడు రూ.281.48కోట్లు మాత్రమే హస్తం పార్టీకి రాగా, ఈసారి రూ.517.37కోట్లు వచ్చాయి. వీటిలో ప్రుడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ -రూ.216.33కోట్లు, ప్రోగ్రెసివ్- రూ.77.34కోట్లు, ఏబీ జనరల్ – రూ.15కోట్లు, మిగిలిన చిన్నవాటి నుంచి కలిపి మొత్తం రూ.313కోట్లు ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ల నుంచే వచ్చాయి. వ్యక్తిగత విరాళాల్లో అత్యధికంగా కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదరంబం రూ.3కోట్లు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్టీకి విరాళాలు ఇచ్చారు. ఇక, ఆప్ కు నిరుడు రూ.11.06కోట్లు రాగా, ఈసారి రూ.38.10 కోట్లు; లోక్ జనశక్తి(రామ్ విలాస్)కు గతేడాది రూ.11.67లక్షలు, ఈసారి రూ.11.09కోట్లు అందాయి.
టీఎంసీకి ఊహించని స్థాయిలో..:
ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకి ఊహించని స్థాయిలో విరాళాలు వచ్చి పడ్డాయి. ఆ పార్టీకి గతేడాది కేవలం రూ.6.52కోట్లు రాగా, ఈసారి ఏకంగా రూ.184.96కోట్లు అందాయి. ఇందులో టైగర్ అసోసియేట్స్ అనే కంపెనీ ఒక్కటే రూ.50కోట్లు ఇచ్చింది.కాగా, ఒడిశాలోని బిజూ జనతాదళ్ కు ఈ ఏడాది రూ.60కోట్లు వచ్చాయి. ఇందులో వేదాంత ట్రస్ట్ నుంచి రూ.25కోట్లు ఉన్నాయి.
బీఆర్ఎస్ కు భారీ తగ్గుదల:
తెలుగు రాష్ట్రాల పార్టీలకు విరాళాల్లో(Political Donations) తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు భారీగా విరాళాలు తగ్గాయి. గతేడాది రూ.580కోట్ల మేర రాగా, ఈసారి కేవలం రూ.15.09కోట్లు మాత్రమే వచ్చినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ. 10కోట్లు, ప్రుడెంట్ నుంచి రూ.5కోట్లు అందాయి. అలాగే వైఎస్సార్సీపి నిరుడు రూ.184కోట్లు విరాళాలు అందగా, ఈసారి రూ.140కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి రూ.83.04కోట్లు వచ్చాయి. ఇది గతేడాదితో పోలిస్తే రూ.17కోట్లు తగ్గుదల. ప్రస్తుత విరాళాల్లో వీటిలో ప్రుడెంట్ నుంచి రూ.25కోట్లు, ఏబీ జనరల్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ.5కోట్లు వచ్చాయి.
Read Also: రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కవిత
Follow Us On: WhatsApp


