కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ –REC) నుంచి తీసుకున్న అప్పును, దానిపైన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించేసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్ఈసీ 2016-19 మధ్యకాలంలో రూ. 30,536 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 28,995 కోట్లు విడుదలైంది. మూడు విడతల్లో మంజూరు చేసిన ఈ రుణానికి 10.90% మేర వడ్డీ రేటు ఫిక్స్ చేసింది.
ప్రతీ నెలా అసలు, వడ్డీని మొత్తం 144 ఇన్‌స్టాల్‌మెంట్లలో 2023 సెప్టెంబరు నుంచి 2035 ఆగస్టు వరకు చెల్లించాలన్నది కాళేశ్వరం(Kaleshwaram) కార్పొరేషన్‌తో ఆర్ఈసీ కుదుర్చుకున్న ఒప్పందం. అయితే వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున రుణాలను రీషెడ్యూలు చేయడానికి, వడ్డీ రేటును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఆర్ఈసీ సానుకూలంగా స్పందించలేదు. దీంతో రిజర్వు బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని దానితో ఆర్ఈసీ మొత్తం బకాయిలను చెల్లించినట్లు సాగునీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్ఈసీతో తెగిపోయిన రుణానుబంధం :
క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉన్నప్పటికీ గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల రీత్యా మూడు నెలల పాటు చెల్లించకపోవడంతో ఆర్ఈసీ లేఖ రాసి ఎన్‌పీఏలో పెడతామని హెచ్చరించింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలోనూ ఇదే ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రతీసారి ఇబ్బందులపాలు కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచుకుని రిజర్వు బ్యాంకు ద్వారా అప్పు తీసుకుని మొత్తం రుణాన్ని, వడ్డీని చెల్లించేసినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. వడ్డీ రేటు 10.90% ఉన్నందున రిజర్వు బ్యాంకుతో పోలిస్తే దాదాపు 4% తక్కువ కావడంతో ప్రతి నెలా రూ. 700 కోట్ల మేర భారం తగ్గినట్లయిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇకపైన ఆర్ఈసీకి చెల్లించాల్సిన ఇబ్బందులేవీ ఉండవన్నాయి.
Read Also: రాజకీయ పార్టీలకు విరాళాల్లో పెరుగుదల
Follow Us On: WhatsApp


