కలం, నల్లగొండ బ్యూరో: అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజల నుండి రూ.వందల కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన విప్స్ గ్రూప్ ఆగడాలకు నల్లగొండ (Nalgonda) పోలీసులు చెక్ పెట్టారు. వేవ్ అనే కొత్త పేరుతో మరోసారి మోసానికి తెరలేపిన 10 మంది ఏజెంట్లను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన వినోద్ తుకారాం ఖుటే 2016లో విప్స్ గ్రూప్ వాలెట్ యాప్‌ను ప్రారంభించి, అనంతరం దానిని గ్రూప్ ఆఫ్ కంపెనీలుగా విస్తరించాడు. మల్టీ-లెవల్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల పెట్టుబడులు సేకరించారు. ఇటీవల నల్లగొండలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో పాత కస్టమర్లను పిలిపించి వేవ్ అనే కొత్త స్కీమ్‌లో రూ.1లక్ష పెట్టుబడి పెడితే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని నమ్మిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఈ కేసులో కానాల లక్ష్మినారాయణ రావు, పున్నం బాలకృష్ణ, ఉయ్యాల శ్రీనివాస్ సహా 10 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు వినోద్ తుకారాం ఖుటే, సుమిత్ పురాంక్, కళ్యాణ్ చక్రవర్తి, గుమ్మల సత్యనారాయణ, గుమ్మల అభినాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. “సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకండి. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నల్లగొండ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవ రావు, ఎస్‌ఐ సైదా బాబులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
Read Also: అమీన్‌పూర్‌లో రెండోరోజు హైడ్రా కూల్చివేతలు
Follow Us On: Instagram

