కలం, జనగామ: కూతురిని రూ.20 లక్షలకు అమ్ముకొని, ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపించిన ఘటనలో తండ్రి, సవతి తల్లి, వివాహం చేసుకున్న వ్యక్తిని శుక్రవారం జనగామ (Jangaon) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జనగామ పోలీసులు నేరం సంఖ్య 276/2026 కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల లహరి (18) జనగామలోని గౌతమి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆమె తండ్రి కక్కెర్ల రాకేష్ గౌడ్, సవతి తల్లి రేణుక కలిసి లహరిని పెంబర్తి గ్రామానికి చెందిన ఆవుల ప్రశాంత్ రెడ్డికి రూ.20 లక్షలకు ఇచ్చి వివాహం జరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
యువతికి పెళ్లి ఇష్టం లేకపోయినా “వివాహం చేసుకోకపోతే పురుగుల మందు తాగి చనిపోతాం” అంటూ తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఈ నెల 8న వివాహం జరిపించారు. అనంతరం ఈ నెల 21న బాధిత యువతి జనగామ (Jangaon) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం తండ్రి రాకేష్ గౌడ్, సవతి తల్లి రేణుక, వరుడు ఆవుల ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్, చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది కర్ణాకర్, కృష్ణ, అనిల్ కుమార్, రమేష్, మధులను జనగామ ఇన్‌చార్జ్ ఏసీపీ భీమ్ శర్మ అభినందించారు.
Read Also: భూదాన్ భూముల కబ్జా.. ఖమ్మంపై ఈడీ గురి
Follow Us On : WhatsApp

