కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) జిల్లా వి.యం. బంజర పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా (Interstate Theft Gang) ఆట కట్టించారు. పెనుబల్లి (Penuballi) మండలం లంకపల్లి గ్రామ శివారులోని పామాయిల్ తోటలో కాపలాగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను మంగళవారం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో లంకపల్లికి చెందిన పాత నేరస్థులు మణికల వసంతరావు, మణికల రమేష్‌లతో పాటు ఏలూరు జిల్లాకు చెందిన పొన్నూరి కోటేశ్వరరావు, తుమ్మల శేఖర్ ఉన్నారు.
ఈ ముఠా (Interstate Theft Gang)లోని పొన్నూరి రాంబాబు, మణికల సురేష్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా పగటిపూట ఆటోలలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తారు. అర్ధరాత్రి సమయంలో పశువుల పాకల వద్ద ఉండే గడ్డపారలతో ఇళ్ల తాళాలు పగలగొట్టి, బీరువాలలోని బంగారం, నగదు దోచుకుని పొలాల గుండా పారిపోతారు. విచారణలో వీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వి.యం. బంజర, వేంసూర్, సత్తుపల్లి పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాట్రాయి పరిధిలో కలిపి మొత్తం 7 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లతో పాటు సుమారు రూ.11.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై గతంలోనే హిస్టరీ షీట్ ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. జైలుకు వెళ్లొచ్చినా ప్రవర్తన మారకపోవడంతో ఈసారి వీరిపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద (BNS సెక్షన్ 111) కేసు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం సత్తుపల్లి కోర్టుకు తరలిస్తున్నామని, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కేసును చేధించిన వి.యం. బంజర ఎస్ఐ, పోలీసు సిబ్బందిని ఏసీపీ వసుంధరా యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Also: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. షెడ్గేకు ఛాన్స్
Follow Us On: X(Twitter)

