తెలంగాణ సర్కార్ నిర్ణయాలు.. ఉన్నతాధికారులకు నిందలు!

కలం, తెలంగాణ బ్యూరో: పాలసీ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే, నిందలు మాత్రం వాటిని అమలు చేసే అధికారులు మోస్తున్నారు. ఓవైపు కేబినెట్‌లో తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత.. మరోవైపు వాటిని అమలు చేసే క్రమంలో ఎదురవుతున్న లీగల్ చిక్కులతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. విధాన నిర్ణయాలు సీఎం, మంత్రులు తీసుకుంటే.. వాటికి జవాబుదారీ మాత్రం బ్యూరోక్రాట్లు అవుతున్నారు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య మొదలు.. తాజాగా ఐపీఎస్ రంగనాథ్, ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా వరకు చాలామంది అధికారులు కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. కొందరిపై సీబీఐ దర్యాప్తు జరుగుతుంటే, మరికొందరిపై కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కొనసాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో కొందరు బ్యూరోక్రాట్లు జ్యుడీషియల్ రిమాండ్ ఎదుర్కొంటే, మరికొందరు సర్వీసు నుంచి రిమూవ్ అవుతున్నారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని పరిస్థితుల్లో కోర్టులకు చేరడంతో సంబంధిత శాఖల బ్యూరోక్రాట్లు విచారణను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బ్యూరోక్రాట్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య సీబీఐ దర్యాప్తు ఎదుర్కొన్నారు. అప్పట్లో తీసుకున్న పరిపాలనా నిర్ణయాల అమల్లో అధికారుల పాత్రపైనే ప్రధాన విచారణ కొనసాగింది. రాజకీయ నాయకులు, గనుల సంస్థల ప్రతినిధులపైనా దర్యాప్తు జరిగింది.

కానీ ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారులే ఎక్కువగా చర్చలో నిలిచారు. ఈ కేసుల్లో అనేక అంశాలు సుదీర్ఘ న్యాయ ప్రక్రియలో కొనసాగాయి. వివిధ అభియోగాలపై వేర్వేరు దశల్లో విచారణలు జరిగాయి. గత బీఆర్ఎస్ హయాంలోనూ వివిధ హోదాల్లో పనిచేసిన ఎస్కే జోషి, సోమేశ్ కుమార్, శాంతికుమారి కోర్టు ధిక్కరణ కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు.

కోర్టు ధిక్కరణ కేసుల్లోనూ ప్రభుత్వ నిర్ణయమే కీలకం

నిబంధనల ఉల్లంఘన, భూసేకరణ పరిహారం చెల్లింపులో అవకతవకలు, కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యం, ఖజానా నుంచి నిధుల విడుదల.. ఇలాంటి అంశాల్లోనే బ్యూరోక్రాట్లు ఎక్కువగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు నిధుల విడుదలపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కారణంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయాలంటూ సిటీ పోలీసు కమిషనర్‌కు హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

నిజానికి నిధుల విడుదల విషయంలో ఆర్థిక మంత్రి గానీ, సీఎం గానీ, కేబినెట్ గానీ నిర్ణయం తీసుకుంటేనే ఫండ్స్ రిలీజ్ చేసే ఆర్డర్ ఆయన ఇవ్వగలరు. అధికారే సొంతంగా ఉత్తర్వులు ఇవ్వలేరని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమలు కావాలంటే సంబంధిత శాఖ మంత్రి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి, అవసరమైతే కేబినెట్ ఆమోదం తప్పనిసరి అని గుర్తుచేశాయి. కానీ కోర్టు ఆదేశాలు అమలు కాలేదనే కారణంతో ఆయా శాఖల కార్యదర్శులే కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ప్రతివాదులుగా మారుతున్నారు.

పాలకుల నిర్ణయాలకు అధికారులది బాధ్యత

రాజకీయ నిర్ణయాలు, పరిపాలనా బాధ్యతల మధ్య చిక్కుకుపోయే పరిస్థితి తరచూ ఎదురవుతుండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో అప్పట్లో వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలు, భూసేకరణ పరిహారాలు, ప్రమోషన్లు, రెగ్యులరైజేషన్, పెన్షన్ బకాయిలు, కోర్టు ఆదేశాల అమలు వంటి అంశాలపై అధికారులే కోర్టు మెట్లెక్కారు. విధాన నిర్ణయాలు రాజకీయ నాయకత్వం తీసుకున్నప్పటికీ, అమలు బాధ్యత కార్యనిర్వాహక యంత్రాంగంపై ఉండటంతో న్యాయస్థానాలు వారినే ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను కాకుండా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? లేదా? కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యాయా? లేదా?.. అనేదే విచారణల్లో కీలకాంశం. కోర్టు ఉత్తర్వులను అమలు చేసే రాజ్యాంగబద్ధ బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉంటున్నందున చీఫ్ సెక్రటరీ మొదలు సంబంధిత శాఖల కార్యదర్శుల వరకు జవాబుదారీ అవుతున్నారు. విధాన నిర్ణయం తీసుకున్న పాలకుల కంటే దాన్ని అమలు చేయాల్సిన అధికారే కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తున్నది.

బ్యూరోక్రాట్లు బాధితులా? బాధ్యులా?

అధికారులు కేవలం ఉత్తర్వులు అమలు చేసే యంత్రాంగం మాత్రమే కాదని, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా వారిదేనని రిటైర్డ్ బ్యూరోక్రాట్లు గుర్తుచేస్తున్నారు. ‘‘చట్టవిరుద్ధమైన ఆదేశాలపై అభ్యంతరం చెప్పే అవకాశం అధికారులకు ఉంటుంది. ప్రభుత్వానికి నిబంధనల గురించి, ఉల్లంఘనల గురించి వివరించవచ్చు. ప్రతి సందర్భంలో అధికారులను కేవలం ‘బాధితులు’గా చూడలేం. కోర్టు ధిక్కరణ విచారణను ఎదుర్కొంటున్నందున వారిని దోషులుగానో లేక బాధ్యులుగానో పరిగణించలేం. విధాన నిర్ణయాలు తీసుకునేది సీఎం, మంత్రులు అయినా వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేది సంబంధిత శాఖల అధికారులే. దీంతో వాటి అమలులో జాప్యం జరిగినా, ఉల్లంఘనలు జరిగినా, కోర్టులో వివాదాలుగా మారినా వివరణ ఇవ్వాల్సింది వాళ్లే.. కోర్టు ముందు నిలబడాల్సిందీ వాళ్లే” అని రిటైర్డ్ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు.

బోనులో నిలబడేది అధికారులే..

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైతే దానికి జవాబుదారీగా ఉండాల్సింది, చివరకు కోర్టు బోనులో నిలబడాల్సింది అధికారులేనని ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్ పేర్కొన్నారు. “ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని కేబినెట్ ఆమోదిస్తుంది. సంబంధిత మంత్రి ప్రకటిస్తారు. ఆ నిర్ణయం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సంబంధిత ఫైల్ నిర్దిష్ట విభాగం కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి టేబుల్‌పైకి వస్తుంది. అక్కడి నుంచి ఉత్తర్వులు వెలువడతాయి. అలా తీసుకున్న ప్రభుత్వ విధాన నిర్ణయం వివాదాస్పదమై కోర్టు మెట్లు ఎక్కితే లేదా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైతే న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తున్నది సంబంధిత శాఖ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, కమిషనర్ లేదా కలెక్టర్. కానీ నిర్ణయాలు తీసుకున్న మంత్రులు గానీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి గానీ కాదు. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఈ ప్రాక్టీసే కొనసాగుతున్నది. ప్రభుత్వ నిర్ణయాల్లో రాజకీయ నాయకులు సైలెంట్‌గా ఉంటున్నా అమలులో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులకు మాత్రం అధికారులే జవాబుదారీగా నిలబడాల్సి వస్తున్నది” అని వ్యాఖ్యానించారు.

కోర్టు కేసుల్లో చిక్కుకున్న కొందరు అధికారులు..

శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య: వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓబులాపురం మైనింగ్ కేసులో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలతో ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యపై సీబీఐ కేసులు నమోదు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్, బెయిల్, విచారణ ఎదుర్కొన్నారు.

సోమేశ్ కుమార్: బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ సమయంలో బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వడంలో ఉల్లంఘనలు, ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలులో అవకతవకలు, కోర్టు ధిక్కరణ.. ఇలాంటి అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 440 కోర్టు ధిక్కరణ కేసులు ఆయనపై నమోదయ్యాయి.

రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, లోకేశ్ కుమార్: వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ సమయంలో నష్టపరిహారం చెల్లింపుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదనే కారణంతో 2026 జనవరిలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ల్యాండ్ కమిషనర్ లోకేశ్ కుమార్‌‌పై కేసు నమోదు.

శాంతికుమారి, హనుమంతరావు: తెలంగాణ హైకోర్టు 2022లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదనే కారణంతో అప్పటి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుపై ధిక్కరణ కేసుకు సంబంధించి షోకాజ్ నోటీసుల జారీ.

హైడ్రా చీఫ్ రంగనాథ్: లోతుకుంట భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదనే కారణంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పోస్టు నుంచి ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చినా జడ్జి సంతృప్తి చెందలేదు. ఒక దశలో “ఆయన మళ్లీ ఆ ప్రాంతానికి వస్తే అరెస్టు చేయాలి” అని ఆదేశించారు.

సందీప్ కుమార్ సుల్తానియా: కంటోన్మెంట్‌బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై జాప్యం జరగడం, హైకోర్టు ఆదేశాలను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అమలు చేయకపోవడం, కోర్టు విచారణకు గైర్హాజరు కావడం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయనను అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలని సిటీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>