కలం, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం మధ్యస్థ దశలో ఉన్న ఎల్ నినో (El Nino) డిసెంబర్ నాటికి పీక్స్ కు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నది. “ఎల్ నినో గతంలోని ప్రాథమిక స్థాయి నుంచి ఇప్పుడు మధ్యస్థ దశకు చేరుకున్నది. సముద్ర ఉపరితల ప్రాంతంపై దాదాపు ఒకటిన్నర సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మరో రెండు నెలల్లో ది స్ట్రాంగ్ ఎల్ నినోగా మారుతుంది. డిసెంబర్ కల్లా పీక్ స్టేజీకి వెళ్తుంది. వచ్చే సంవత్సరం మార్చి నెల నుంచి క్రమంగా తగ్గుతుంది. స్ట్రాంగ్ ఎల్ నినో, పీక్ ఎల్ నినో ప్రభావంతో ఒక్కో సారి కుంభవృష్టి, మరికొన్నిసార్లు అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుంది” అని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ అధికారి రఘు వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఇవే హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడుతున్నా ఎల్ నినో ప్రభావం లేదనే భావనకు రావద్దని, ఒకచోట భారీగా మరోచోట పడకపోవడం లాంటి అసమాన పరిస్థితి ఉన్నట్లు వాతావరణ కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఎల్ నినో ఎఫెక్ట్ ఇకపైన మరింత స్పష్టంగా ప్రభావం చూపనున్నది. ఈ పరిస్థితి సాగు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, రబీ పంటలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న విశ్లేషణలూ వస్తున్నాయి.
రిజర్వాయర్లు నిండాకే సాగునీరు
నైరుతి రుతుపవనాల ప్రభావం ఎల్ నినోతో రివర్స్ కావడంతో రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఆశించినంత నీరు చేరలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లోకి నీరు చేరుతున్నా రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండడంలేదు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని సాగు భూములకు సుమారు 330 టీఎంసీలకు పైగా నీరు అవసరం, ఉన్నా ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలోకలిపి 45 టీఎంసీలలోపే ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు లెక్కలు తేల్చారు. సాగునీటి విడుదలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, త్వరలో జరిగే సమావేశంలో ఖరారవుతుందని ఇరిగేషన్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్లో ఒకటి, రెండు మినహా వర్షాలు కురిసే అవకాశం లేదన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టులు నిండిన తర్వాతే సాగునీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాకే ఆయకట్టుకు సాగు నీటి సరఫరాపై నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
నీరు విడుదల చేస్తే రైతులకే నష్టం
ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితుల వల్ల లోటు వర్షపాతాలు ఉంటాయని ముందస్తుగానే భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయాన్ని ఇరిగేషన్ అధికారులు ఇటీవల చర్చించారు. సెప్టెంబరులో ఒకటి రెండు మినహా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం లేదన్న హెచ్చరికలు ఉన్నందు ఒకవేళ ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో సాగుకు ప్రోత్సహిస్తే, తరువాత పరిణామాలు తీవ్ర నష్టం కలిగిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. వచ్చే ఏడాది జులై వరకు తాగు నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి అందుబాటులో ఉన్నది 44 టీఎంసీలే. సాగు, తాగు అవసరాలకు కావాల్సింది 336 టీఎంసీలు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో కలిపి 29.75 లక్షల ఎకరాలకు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉండడంతో సరఫరా సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎల్ నినో ప్రభావంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఎల్ నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో రాబోయే రెండు నెలల్లో స్పష్టత రానున్నది.

