కలం, వెబ్డెస్క్: ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) 57వ స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 587 మందికి పీహెచ్డీ, 3,000 మంది డిగ్రీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ కూడా అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత యువత సామర్థ్యం, ప్రతిభపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దే ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశానికి యువత అవసరం ఎంతో ఉందని చెప్పారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత ఆలోచనలు, నిర్ణయాలు ఎంతో కీలకమని మోదీ (PM Modi) పేర్కొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నిరంతరం నేర్చుకుంటూ, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ‘పరమ్ ప్రజ్ఞ’ ఏఐ ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్కంప్యూటింగ్ సదుపాయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఏఐ, అధునాతన పరిశోధనలకు మద్దతుగా ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ కేవలం టెక్నాలజీ వినియోగదారుడిగా కాకుండా, వ్యూహాత్మక సాంకేతిక రంగాలలో సృష్టికర్తగా ఎదగాలనే ఆకాంక్షకు ఇది ప్రతీక నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : పంత్ కోరికకు ఉత్తరాఖండ్ సీఎం గ్రీన్ సిగ్నల్!
Follow Us On : WhatsApp

