కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) లో బీఆర్ఎస్ కౌన్సిలర్ (BRS Councillor) గెరిగంటి లక్ష్మీనారాయణ (Geriganti Laxminarayana) వినూత్న నిరసన చేపట్టారు. వర్షంతో నీటి కుంటలా మారిన కామారెడ్డి కరీంనగర్ నడిరోడ్డుపై నీళ్ళల్లో కూర్చొని ఆందోళనకు దిగారు. కామారెడ్డి పోలీసు స్టేషన్ ముందు వర్షం కురిసిన ప్రతీసారీ ఇలా నీటి కుంటలా మారుతుందని పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళే జాతీయ రహదారిలో స్టేషన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ ముందు వరద నీరు భారీగా నిలిచిపోయింది. ఆ రోడ్డు ఒక కుంటను, ఒక చెరువును తలపిస్తూ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నీటి కుంటగా మారిన రోడ్డు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నీటి కుంటతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదే దారిలో ఉండటం వల్ల రోగులు, క్షతగాత్రులు ఎమర్జెన్సీ సమయంలో 108 వాహనం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇతర వాహనాలకు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుందని అన్నారు. కామారెడ్డి నుంచి కరీంనగర్ ప్రధాన రహదారి ఇది ఒక్కటే కావడం వల్ల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించకుంటే అక్కడే దీక్ష చేపడతానని హెచ్చరించారు.

