వాగు దాటితేనే ఊరు: గైరాన్ తండా జలపరీక్ష!

క‌లం, మెద‌క్ బ్యూరో : వాన వచ్చిందంటే చాలు.. ఆ ఊరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక, ఉప్పొంగి ప్రవహించే వాగులను దాటలేక, ప్రతి వర్షాకాలం ఆ గ్రామస్థులకు ఒక జ‌ల ప‌రీక్ష‌గా మారుతోంది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, ఉధృతంగా ప్రవహించే వాగును దాటుతూ నడిచే ఆ భయానక దృశ్యాలు నేటికీ సంగారెడ్డి జిల్లాలోని గైర‌న్ తండా (Gairan Thanda)లో నిత్యకృత్యంగా మారాయి.

వ‌ర‌ద‌లోనే ప్ర‌యాణం..

సంగారెడ్డి జిల్లా నార‌య‌ణ ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గంలోని సిర్గాపూర్ మండలంలోని గైరాన్ తండా వాసులకు వర్షాకాలం వచ్చిందంటే చాలు నరకం ప్రత్యక్షమవుతోంది. గైరాన్ తండాలో 600 మంది జ‌నాభ‌ను క‌ల్గిఉన్న‌ది. తండాలో అంతా గిరిజ‌నులు నివాసం ఉంటారు. ఈ గ్రామం ఏర్పడిన నాటి నుంచి 70 యేళ్లుగా చినుకు ప‌డితేచాలు ఈ తండా ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ గైరాన్ తండాకు చేరుకొవ‌లంటే ఉన్న ఏకైక మార్గం వ‌గ్ద‌ల్ గ్రామం నుండి మాత్ర‌మే ఉన్న‌ది. అయితే వగ్దల్ గ్రామం నుండి గైరాన్ తండాకు వెళ్లాలంటే ముందుగా ఒక కిలోమీటరు మేర వాగులో నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లాలి. రోడ్డు మార్గం లేక‌పొవ‌డంతో వాగు అటు నుంచి ఇటూ వైపు తాడును అధారంగా చేసుకోని వ‌ర‌ద ప్ర‌వాహంలోనే రాక‌పోక‌లు సాగిస్తుంటారు. సాధారణ రోజుల్లో మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నప్పటికీ, భారీ వర్షాలు కురిస్తే వ‌ర‌ద‌ ప్రవాహం ఉధృతమవుతుంది.

ఆపై కిలోమీటరు బురద, మట్టి రోడ్డు దాటాక తండా శివారు వద్ద పది అడుగుల ఎత్తులో పొంగిపొర్లే మరో భారీ వాగు స్వాగతం పలుకుతుంది. వాగుపైనే చిన్నపాటి చెక్ డ్యామ్ ఉన్న‌ప్ప‌టికి, నాచు పట్టి ఉండటంతో ప్రమాదకరమైన ఉంటుంది. దింతో వేరే గ‌త్యంత‌రం లేక నీటి ప్రవాహంలోనే వాగు దాటాల్సి వస్తోంది. నీటిలో జారిపడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవడం, ప్రవాహంలో పాములు, విషకీటకాలు కొట్టుకురావడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. వందలాది మంది తండావాసులు ప్రవాహ ధాటికి కొట్టుకుపోకుండా, అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పించుకుంటూ ప్ర‌యాణం సాగిస్తుంటారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు ఈ వాగులో కొట్టుకుపోయి మరణించారు.

రోడ్డు లేక ఇక్క‌ట్లు..

తండాలో సుమారు 600 మంది జనాభా ఉండగా, 60 మంది వరకు విద్యార్థులున్నారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో ఉన్న‌త‌చదువుల కోసం పిల్లలు స‌మీప గ్రామాల‌కు రోజువారీగా ఈ వాగు దాటి వెళ్లక తప్పదు. వర్షం పడితే చాలు రోజులు తరబడి విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఒకవేళ బడికి వెళ్లాక వర్షం వస్తే, వాగు దాటలేక రాత్రికి వగ్దల్ గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఈ భయాల కారణంగా పిల్ల‌ల చ‌దువుల మీద ప్ర‌భావం ప‌డుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలను చదువుకు దూరం అవుతున్నారు.

వర్షాకాలమే కాదు, సాధారణ రోజుల్లోనూ గైరాన్ తండాకు బైక్ తప్ప వేరే వాహనం వెళ్లలేని పరిస్థితి. అటో, జీపులు ఇత‌ర ఏ వాహ‌నాలు కుడా గ్రామానికి వ‌చ్చే ప‌రిస్ధితి లేదు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల ఈ గ్రామ‌ ప్రజలు అనేక రకాల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. రవాణా సౌకర్యం కొరవడటం అనేది కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, వారి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

రోడ్డు స‌దుపాయం లేక‌పొవ‌డంతో అత్యవసర సమయంలో ఈ గ్రామానికి ‘108’ అంబులెన్స్ సైతం రాదు. తీవ్ర‌మైన అనార్యోగ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, నిండు గర్భిణీలు ఉంటే ప్రసవ సమయానికి ముందే నారాయణఖేడ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంచడమో, లేదా బంధువుల ఇళ్లకు పంపడమో చేస్తున్నారు. గ్రామానికి క‌నీస‌ రోడ్డు సౌకర్యం లేక‌పొవ‌డం, వాగు దాటే కష్టాలు చూసి ఈ తండా యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

క‌నీస మౌలిక వ‌స‌తి అయిన రొడ్డు లేక‌పొవ‌డంతో గైరాన్ తండా ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను ద‌శబ్ధాలు ఎదుర్కొకుంటున్నారు. ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చిన ఈ గ్రామానికి రొడ్డు వేయ‌లేక‌పోయారు. ఎన్నిక‌ల‌ప్ప‌డు ఓట్ల కోసం హ‌మీలు ఇవ్వ‌డం త‌ప్ప త‌మ గ్రామానికి క‌నీసం రోడ్డు కుడా వేయ‌డం లేద‌ని తండావాసులు అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

రొడ్డులేక త‌మ తండా మారుమూల ప్రాంతంగా వెనుక‌బ‌డిపోతుంద‌ని, ఇప్ప‌టికైన రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాల‌ని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అనేక తండాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, గైరాన్ తండా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జి, రోడ్డు సౌకర్యం కల్పించాలని తండావాసులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>