కలం, హుజూర్ నగర్: చట్టాన్ని రక్షించాల్సిన ఒక రక్షకుడే భక్షకుడిగా మారాడు. సమాజంలో బాల్యవివాహాలను అరికట్టాల్సిన పోలీస్ అధికారి, కట్నం ఆశతో ఒక మైనర్ బాలిక జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. అర్ధరాత్రి వేళ రహస్యంగా మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ మైనర్ బాలికను వివాహం చేసుకోవడంపై జిల్లా ఎస్పీ నరసింహ తీవ్రంగా స్పందించారు. నిందితుడైన కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్, గత కొంతకాలంగా మరో యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అయితే అనిల్ కుమార్ గౌడ్ మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న సదరు యువతి (గతంలో ప్రేమించిన యువతి) వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై స్పందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఫోటోలు, పెళ్లికి సంబంధించిన శుభలేఖలను (అబ్బాయి, అమ్మాయి తరపు లగ్నపత్రికలు) పక్కా ఆధారాలుగా సేకరించారు.
వీటితో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్ గత రెండు రోజులుగా పరారీలో ఉన్నాడు. కాగా, పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితుడి కుటుంబ సభ్యులతో పాటు మైనర్ బాలిక కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలైన మైనర్ బాలికకు శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా హుజూర్ నగర్ సీఐని ఎస్పీ నియమించారు. గతంలోనూ సదరు కానిస్టేబుల్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చి పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి ఇలాంటి ఘోరానికి ఒడిగట్టిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.

