కలం, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. సురేఖ కూతురు కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను ఆదేశించింది.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. చిన్నారెడ్డి ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో ఒక సభలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై, స్థానిక ఎమ్మెల్యే పై చేసిన అనుచిత ప్రసంగాల పై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండడంతో ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది.

