నల్లగొండ ప్రిన్సిపల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు

కలం, నల్లగొండ: కొండమల్లేపల్లి(Kondamallepalli) నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును (Principal Murder Case) నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేసి ఛేదించారు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న రూపారెడ్డి తన నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనపై కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఎస్పీ కేసును సవాలుగా తీసుకుని దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 40 మంది అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

దర్యాప్తులో భాగంగా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. హత్యకు కొన్ని క్షణాల ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. చివరిగా ఆమె ‘బాబు’ అని సంబోధించడంతో పోలీసుల దృష్టి విద్యార్థుల వైపు మళ్లింది. రూపారెడ్డి సాధారణంగా పాఠశాల విద్యార్థులను ‘బాబు’ అని పిలుస్తారని తెలియడంతో ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థుల హాజరును పరిశీలించగా, రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని ఇద్దరు మైనర్ విద్యార్థులపై అనుమానం వచ్చింది. నమ్మదగిన సమాచారంతో దొనియాల క్రాస్‌రోడ్ వద్ద బైక్‌పై వెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న రూ.1.54 లక్షల నగదులో కొన్ని రూ.500 నోట్లపై రక్తపు మరకలు గుర్తించారు. దీంతో విచారణలో విద్యార్థులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

పగ, జల్సాల కోసమే పథకం

హాస్టల్‌లో ఫోన్ వాడుతూ పట్టుబడటంతో ప్రిన్సిపల్ మందలించడం, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించిన విద్యార్థులు సులభంగా డబ్బు సంపాదించేందుకు హత్యకు పథకం వేసినట్లు తెలిపారు. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలనే విషయాలను తెలుసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పథకం ప్రకారం కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేసి, ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం గదిలోని రూ.2.50 లక్షల నగదుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును శాస్త్రీయ పద్ధతుల్లో వేగంగా ఛేదించిన దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ ఏ. నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>