కొరత నుంచి పుట్టిన క్రేజీ వంటకాలు!

కలం, వెబ్‌ డెస్క్‌ : మనం రోజూ ఎన్నో వంటకాలను ఎంజాయ్ చేస్తూ లాగించేస్తుంటాం. వాటి పుట్టుక గురించి అసలే ఆలోచించం. ఒకవేళ ఎవరైనా అడిగినా ఎవరో ఖాళీగా ఉన్నప్పుడు ఈ కాంబో కనిపిట్టి ఉంటాడని అనేస్తాం. కానీ మనం రోజూ ఎంతో ఎంజాయ్ చేస్తూ తినే చాలా వంటకాలు కరువు నుంచి పుట్టినవని మీకు తెలుసా? పిజ్జా, రామెన్ నూడిల్స్, కిచిడి ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు, యుద్ధాలు, వలసలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురైన ఆహార కొరత నుండి పుట్టినవే. పరిమితమైన వస్తువులతోనే కడుపు నింపుకోవాలనే తపన, మనుషుల్లోని సృజనాత్మకతను నిద్రలేపింది. అలా కాలక్రమేణా మిగిలిపోయిన పదార్థాలతో చేసిన ప్రయోగాలు నేడు ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లలో, ఇళ్లలో అద్భుతమైన వంటకాలు (Famous Dishes)గా స్థానం సంపాదించుకున్నాయి. విలాసం కంటే అవసరమే ప్రపంచ వంటకాలను ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పడానికి ఈ వంటకాలే నిదర్శనం.

కిచిడీ..

భారతీయ వంటశాలలలో కిచిడీ అనేది ఎంతో నమ్మకమైన, ఆరోగ్యకరమైన ఆహారం. బియ్యం, పప్పులను పసుపు, ఉప్పుతో కలిపి ఉడికించి, కొద్దిగా నెయ్యి వేసి దీనిని తయారుచేస్తారు. అనారోగ్య సమయాల్లో లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో, సులభంగా జీర్ణమయ్యేలా ఈ వంటకం తోడ్పడింది. ధాన్యాలు, పప్పులు కలవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. ఒకే పాత్రలో వండటం వల్ల సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ఒకప్పుడు కేవలం అవసరం కోసం పుట్టిన ఈ ఆహారం, నేడు అందరికీ ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్‌గా మారింది.

ఫాండ్యూ..

ఈ రోజుల్లో ఫాండ్యూ అనేది వేడుకల్లో తినే వంటకం అయినప్పటికీ, దీని మూలాలు స్విట్జర్లాండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ కఠినమైన శీతాకాలంలో తాజా ఆహారం దొరకడం కష్టంగా ఉండేది. దాంతో ప్రజలు నిల్వ ఉంచిన గట్టిపడిన చీజ్, ఎండిపోయిన రొట్టెలపై ఆధారపడేవారు. ఆ గట్టిపడిన చీజ్‌ను వైన్‌తో కలిపి వేడి చేయడం ద్వారా దానికి మళ్లీ మంచి రుచిని, రూపాన్ని తీసుకొచ్చేవారు. ఆ వేడి చీజ్‌లో పాత రొట్టె ముక్కలను ముంచుకుని అందరూ కలిసి ఒకే పాత్ర నుండి తినేవారు. ఇది చలి కాలంలో వారికి అవసరమైన వేడిని, శక్తిని ఇచ్చే ఆచరణాత్మక పరిష్కారంగా పనిచేసింది.

మార్గరీటా పిజ్జా..

నేపుల్స్ నగరంలోని శ్రామికులు, పేద ప్రజల కోసం తక్కువ ఖర్చుతో, త్వరగా తయారయ్యే ఒక వీధి ఆహారంగా పిజ్జా ప్రారంభమైంది. ఇటలీలో సమృద్ధిగా పండే టమోటాలు, కొద్దిగా మోజారెల్లా చీజ్, కొన్ని తులసి ఆకులను ఫ్లాట్‌బ్రెడ్‌పై వేసి ఈ పిజ్జాను తయారుచేసేవారు. కష్టపడి పనిచేసే కార్మికులకు ఇది తక్కువ ధరలో ఎక్కువ శక్తిని ఇచ్చేది. ఆ తర్వాత ఈ రంగులు ఇటలీ జాతీయ జెండాను పోలి ఉండటంతో దీనికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ దీని పునాది మాత్రం పేదరికం, ఆర్థిక అవసరాల నుండే పడింది.

బ్రెడ్ పుడ్డింగ్, ఫ్రెంచ్ టోస్ట్..

ఐరోపా వ్యాప్తంగా ఇళ్లలో మిగిలిపోయిన, గట్టిపడిన రొట్టెలను వృథా చేయకుండా ఉండటానికి బ్రెడ్ పుడ్డింగ్ పుట్టింది. ఆ రొట్టెలను పాలు, గుడ్లలో నానబెట్టి, మెత్తగా అయ్యే వరకు బేక్ చేసేవారు. లభ్యతను బట్టి కొద్దిగా చక్కెర లేదా ఎండిన పండ్లను జోడించేవారు. ఫ్రెంచ్ టోస్ట్ కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. ఫ్రాన్స్‌లో దీనిని ‘పైన్ పెర్డు’ అంటే ‘కోల్పోయిన రొట్టె’ అని పిలుస్తారు. తినడానికి వీలులేనంత గట్టిగా మారిన రొట్టెలను పాలు, గుడ్ల మిశ్రమంలో ముంచి, వాటికి పునర్జన్మ నిచ్చేవారు. ఆహారాన్ని పారేయడం పాపంగా భావించిన రోజుల్లో, మిగిలిపోయిన పదార్థాలను అద్భుతంగా మార్చిన పద్ధతి ఇది.

పోజోల్, హంగేరియన్ గూలాష్..

మెక్సికోలో పుట్టిన పోజోల్ అనే వంటకం మొక్కజొన్న ఆధారంగా తయారవుతుంది. పోషక విలువలను పెంచే ప్రత్యేక పద్ధతిలో ఉడికించిన మొక్కజొన్నను దీనిలో వాడతారు. మాంసం దొరికినప్పుడు దానిని సూప్, మూలికలతో కలిపి ఎక్కువ మందికి సరిపోయేలా చేసేవారు. అలాగే హంగేరియన్ గూలాష్ అనేది పశువుల కాపరులు బయట లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు పెద్ద పాత్రలలో వండుకునే వంటకం. అక్కడ చౌకగా దొరికే పాప్రికా (మిరపపొడి) దీనికి మంచి రంగును, నిల్వ ఉండే గుణాన్ని ఇచ్చేది. గట్టిగా ఉండే మాంసం ముక్కలను ఉల్లిపాయలు, నీళ్లతో కలిపి ఎక్కువ సమయం ఉడికించి ఈ సూప్ తయారుచేసేవారు.

రామెన్..

20వ శతాబ్దం ప్రారంభంలో జపాన్‌లోని కార్మిక వర్గాల కోసం చౌకైన నూడిల్ సూప్‌గా రామెన్ మొదలైంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌లో తీవ్రమైన బియ్యం కొరత ఏర్పడినప్పుడు, అమెరికా నుండి వచ్చిన గోధుమ పిండితో ఈ నూడిల్స్ చేయడం పెరిగింది. నగరాలను పునర్నిర్మించే క్రమంలో కష్టపడుతున్న కార్మికులకు తక్కువ ధరలో కడుపు నింపే ఆహారంగా వీధి స్టాళ్లలో రామెన్ విక్రయించేవారు. ఎముకలు, మిగిలిపోయిన ముక్కలతో చేసిన సూప్, గోధుమ పిండి నూడిల్స్ దీనికి ప్రధాన ఆధారం. ఈ రోజుల్లో ఇది ఎంతో రిచ్ ఫుడ్‌గా మారినప్పటికీ, దీని పునాది మాత్రం ఆకలిని తీర్చడమే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>