భద్రాద్రి ICDS నోటిఫికేషన్.. అభ్యర్థుల్లో కన్‌ఫ్యూజన్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) ఉద్యోగ ప్రకటన స్థానిక నిరుద్యోగ మహిళల్లో తీవ్ర గందరగోళం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 178 అంగన్‌వాడీ టీచర్ (Bhadradri Anganwadi), 878 ఆయా పోస్టులు.. మొత్తం 1,056 ఖాళీల భర్తీకి కొద్దిరోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే.. ఎంపిక ప్రక్రియలో అస్పష్టత కారణంగా అభ్యర్థులను తీవ్ర ఆందోళనలో పడేసింది. జిల్లాలోని ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, నిబంధనలలోని లోపాలే చిక్కుముడిగా మారాయి. సాధారణంగా అంగన్‌వాడీ నియామకాల్లో పట్టణాల్లో సంబంధిత వార్డు, పంచాయతీకి చెందిన నివాసితులను ‘స్థానికత’గా పరిగణిస్తారు.

కాగా.. ఎస్సీ, ఎస్టీ ఏరియాల్లో నిర్దిష్ట నివాసులకు ప్రాధాన్యం ఉంటుంది. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఈ నిబంధనే వివాదానికి దారితీసింది. గిరిజన తండాలు, గూడేల్లోని కేంద్రాలకు సంబంధిత ఆవాసానికి చెందిన ఎస్టీ మహిళలే అర్హులని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఏజెన్సీ పరిధిలోని జనరల్ లేదా ఓపెన్ పోస్టుల నియామకంలో స్థానికతను పంచాయతీగా తీసుకోవాలో లేక అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ఆవాస ప్రాంతంగా పరిగణించాలో మార్గదర్శకాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. నోటిఫికేషన్ నిబంధనల్లో ఏజెన్సీ గిరిజనేతరులు అంశంపై ప్రత్యేక మినహాయింపులు లేదా స్పష్టమైన ప్రామాణికాలు లేకపోవడంతో తాము అర్హులమో కాదో తెలియక గిరిజనేతర మహిళలు అయోమయంలో పడ్డారు.

రాత పరీక్ష లేకపోవడంతో ఆందోళన

మరోవైపు భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకపోవడం, కేవలం ఇంటర్ మార్కులు, ఇంటర్వ్యూ ప్రాతిపదికనే ఎంపిక చేపట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తుది ఎంపికలో ఇంటర్వ్యూ మార్కులే కీలకం కానున్నాయి. అందులో కనీస మార్కులు ఉంటాయా లేదా అనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. రాత పరీక్ష లేకపోవడం, ఇంటర్వ్యూ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో నియామకాల్లో అక్రమాలకు, రాజకీయ సిఫార్సులకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

భద్రాద్రి జిల్లాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నియామకాలు పూర్తి కావాలంటే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని జనరల్ పోస్టులకు సంబంధించి స్థానికత నిబంధనపై పబ్లిక్ నోటీస్ ద్వారా అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపు ప్రక్రియను పారదర్శకం చేసి మెరిట్ జాబితాలను బహిరంగంగా ప్రదర్శించాలి. అస్పష్టమైన మార్గదర్శకాలతో నిరుద్యోగ మహిళల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా, జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకుని న్యాయమైన రీతిలో ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు కోరుతున్నారు.

మినిమం మార్కులు ఇవ్వాలి : వేర్పుల నరేష్, మణుగూరు, భద్రాద్రి జిల్లా

అంగన్ వాడీ ఉద్యోగాలకు ఎంపికకు సంబంధించిన ఇంటర్వ్యూ పారదర్శకంగా జరగాలి. అటెండ్ అయిన ప్రతి అభ్యర్థికి మినిమం మార్కులు ఇవ్వాలి. అలానే గిరిజనేతరుల్లో స్థానికతపై గందరగోళ సమస్య నెలకొంది. మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడంతో నియామకాల్లో అవినీతికి ఎక్కువగా ఆస్కారం ఉండే అవకాశం ఉంది. నియామకాలపై వెంటనే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి.

నివాసిత ప్రాంతమే ప్రాతిపదిక : స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి, భద్రాద్రి జిల్లా

అంగన్ వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు షెడ్యూల్ ప్రాంతాల్లో ఆవాసం (హాబిటేషన్) స్థానికత గా పరిగణిస్తున్నాం. మున్సిపాలిటీ ల్లో వార్డు ప్రాతిపదికగా తీసుకున్నాం. రూరల్ ఏరియాలో పంచాయతీ ప్రాతిపదికగా తీసుకున్నాం. కార్పొరేషన్ అయితే డివిజన్ ప్రాతిపదికగా తీసుకుంటున్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>