కలం, స్పోర్ట్స్: ఉక్రెయిన్‌లో యుద్ధం (Ukraine War) మొదలై నాలుగేళ్లు అవుతోంది. బాంబుల దాడులతో ఇళ్లు వదిలి వెళ్లిన ఇద్దరు యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు ఇప్పుడు కోర్టులో తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖార్కివ్‌కు చెందిన యెవెనియా కాంటెమిర్కు యుద్ధం మొదలైనప్పుడు 16 ఏళ్లు. అప్పటికే ఆమె మోకాలి గాయంతో బాధపడుతోంది. పరిస్థితి తీవ్రం కావడంతో ఆమె కుటుంబం నగరాన్ని విడిచింది. ఇప్పుడు ఆమె తల్లి, సోదరుడు స్లోవేకియాలో ఉంటున్నారు. కాంటెమిర్ మాత్రం బ్యాడ్మింటన్ కెరీర్ కోసం ఫ్రాన్స్, ఇటలీకి వెళ్లింది. యుద్ధం మొదలైన తర్వాత ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లలేదు.
కుటుంబాన్ని ఏడాదిలో రెండుసార్లు మాత్రమే కలుస్తోంది. ఆమె డబుల్స్ భాగస్వామి పోలినా బుహ్రోవా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2022లో యుద్ధం మొదలైన సమయంలో ఆమె జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతోంది. దాడులు పెరగడంతో క్రీడాకారిణులు బ్యాగులు సిద్ధంగా ఉంచుకున్నారు. అలారం మోగిన ప్రతిసారీ బంకర్లకు వెళ్లాల్సి వచ్చేది. బుహ్రోవా ఉంటున్న భవనం పక్కనే బాంబు పడింది. మాజీ కోచ్ సహాయంతో ఆమె అక్కడి నుంచి బయటపడింది. యుద్ధం తర్వాత బుహ్రోవా కూడా పలు దేశాల్లో శిక్షణ తీసుకుంది.
థాయ్‌లాండ్, మలేషియా, డెన్మార్క్ మీదుగా ఇప్పుడు ఇటలీలో శిక్షణ కొనసాగిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంటెమిర్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ గెలిచింది. బుహ్రోవా కూడా తన తొలి మ్యాచ్‌లో మూడు సెట్ల విజయం సాధించింది. యుద్ధ పరిస్థితి ఇంకా తమ జీవితాలను ప్రభావితం చేస్తోందని కాంటెమిర్ తెలిపింది. కీవ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, నాలుగేళ్లుగా పరిస్థితిలో మెరుగుదల కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బుహ్రోవా మాత్రం యుద్ధ బాధ తనకు మరింత బలం ఇస్తోందని భావిస్తోంది. ఉక్రెయిన్ తరఫున పోరాడటం గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. ఇద్దరికీ బ్యాడ్మింటన్ మొదటి ఎంపిక కాదు. కాంటెమిర్కు సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ అంటే ఇష్టం. బుహ్రోవా పియానో, డ్యాన్స్, పాటల్లో శిక్షణ తీసుకుంది. స్టేజ్‌పై మెరుగ్గా కనిపించేందుకు క్రీడను ఎంచుకోవాలని ఆమె టీచర్ సూచించారు. అలా ఆమె బ్యాడ్మింటన్‌లోకి వచ్చింది. ఇక రష్యా క్రీడాకారుల విషయంలో ఇద్దరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తటస్థ జెండాతో అయినా రష్యా ఆటగాళ్లకు పోటీల్లో అవకాశం ఇవ్వడం సరైంది కాదని వారు భావిస్తున్నారు. కాంటెమిర్ స్వదేశంలో జరిగిన పరిస్థితుల కారణంగా రష్యా ఆటగాళ్లను అనుమతించకూడదని పేర్కొంది. బుహ్రోవా కూడా రష్యా ఆటగాళ్లు పోటీల్లో పాల్గొనడం అన్యాయమని అభిప్రాయపడింది. యుద్ధం తమ జీవితాలను మార్చినా.. బ్యాడ్మింటన్‌లో ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు క్రీడాకారిణులు ప్రపంచ వేదికపై ఉక్రెయిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

