కలం, వెడ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా (Israel – US) సంయుక్త దళాలు, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితి వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ్యలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ప్రధాని మోదీ (PM Modi) సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..
పశ్చిమాసియాలో యుద్ధం (West Asia War) ప్రారంభమై మూడు వారాలకు పైగా గడిచిందని.. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీసిందని ప్రధాని మోదీ (PM Modi) చెప్పారు. ఇది భారతదేశానికి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు. ఈ యుద్ధం వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపడమే కాకుండా… పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ కు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తుందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్‌కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయన్న ఆయన.. దాన్ని మూసివేయడంతో హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకున్నాయని తెలిపారు.
పౌరులు, మౌలిక స్థావరాలపై దాడులకు వ్యతిరేకం..
గల్ఫ్ దేశాల్లో సుమారు కోటిమంది భారతీయులు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. గల్ఫ్ లో ఉద్రిక్తతల వల్ల భారతీయుల జీవనోపాధికి రక్షణ కల్పించడం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా నిలిచిపోయిందన్నారు. హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల్లో చాలా మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారని .. ఇలాంటి క్లిష్ట సమయంలో అంతా ఒక్కటై చర్చించడం అత్యావశ్యకం అని సభ్యులను ఉద్దేశించి అన్నారు. యుద్ధం మొదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చామని వివరించారు. పౌరులు, మౌలిక స్థావరాలపై దాడులను వ్యతిరేకించామని.. భారతీయ నౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నామని పేర్కొన్నారు. ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి..
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని.. యుద్ధం కారణంగా ఏర్పడే సంకటం మానవాళికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్న మోదీ.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. సమస్య పరిష్కరం కోసం చర్చలే ముఖ్యమని సూచించినట్లు తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
Read Also: హర్మూజ్‌కు నో ఆల్టర్నేట్
Follow Us On: Facebook

