కలం, వెబ్ డెస్క్: మహాత్మా గాంధీజీని గాడ్సే చంపడం తప్పని చెప్పే ధైర్యం ఉందా? అని బీజేపీ నేతలను కాంగ్రెస్ నేత, మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ప్రశ్నించారు. ఈ మేరకు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను కూడా హిందువునేనని.. ప్రతిరోజు బొట్టుపెట్టుకొని దేవున్ని మొక్కుతానని చెప్పారు. ప్రపంచ దేశాలు మోకరిల్లి మహాత్మాగాంధీ (Mahatma Gandhi) కి దండం పెడుతున్నాయన్నారు. అంతటి గొప్పవ్యక్తి అయిన గాంధీజీని చంపిన గాడ్సేను పొగిడితే ఎట్లా? అని ఫైర్ అయ్యారు. గాడ్సేను బీజేపీ నేతలు పొగిడిన వీడియోలు ఎన్నో ఉన్నాయంటూ దుయ్యబట్టారు. గాంధీజీని చంపిన గాడ్సే గొప్పవాడని చెప్పగలరా? అంటూ బీజేపీ సభ్యులను ప్రశ్నించారు.
భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మతాలను అన్వయించుకోవడం కాదని.. ఆచరణ రూపం ఉండాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను (RSS) నిషేధించిన వారు సర్ధార్ వల్లభాయి పటేల్ అని.. వల్లభాయి పటేల్ గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మన ధర్మాలను కాపాడుకుంటూ.. ఇతర ధర్మాలను గౌరవించుకోవాలని సూచించారు. హిందువుగానే పుట్టిన తాను (Vakiti Srihari).. హిందువుగానే మరణిస్తానని స్పష్టం చేశారు. శ్లోకం, మత ప్రబోధాలను అనర్గళంగా మాట్లాడగలను అని ఆయన చెప్పారు.
Read Also: తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
Follow Us On: Youtube

