కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సంబరాల వేడుకలో ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. భారత్ మాతాకీ జై అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేశారని కొనియాడారు. ప్రజలకు భరోసా కల్పించిన నిజమైన రోజు ఇది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగం గెలిచిందని మోదీ అన్నారు. బెంగాల్ లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రవేశించిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశారు. బెంగాల్ ఈరోజు భయం నుంచి విముక్తి పొందిందని తెలిపారు. బెంగాల్ ఓటర్లు కొత్త రికార్డును సృష్టించారని అన్నారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. ఇది బెంగాల్ ప్రజల విజయమని పేర్కొన్నారు.
అస్సాంలోని (Assam) అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. దేశంలోని పార్టీ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. పార్టీ సంబరాల్లో తానూ పాల్గొంటున్నానని అన్నారు. ఐదు రాష్ట్రాల ప్రజలు భారత రాజ్యాంగాన్ని గెలిపించారని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. గతేడాది బీహార్ ఎన్నికల వేళ ప్రజలకు తాను పిలుపునిచ్చానని.. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని హర్షం వ్యక్తం చేశారు. గంగానది నుంచి ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఘన విజయం సాధించామని మోదీ (PM Modi) తెలిపారు. అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించామని తెలిపారు. పుదుచ్చేరి ప్రజలు మరోసారి ఎన్డీఏపై నమ్మకం ఉంచారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలోఘన విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని (Mamata Banerjee) గద్దె దించి కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ అక్కడ అఖండ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ తరుణంలో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా శ్రమించి బెంగాల్ లో విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందంతో మునిగిపోయారు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On : WhatsApp

