కలం, మునుగోడు: చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని 33 ఫార్మా, కెమికల్ కంపెనీల కాలుష్యంపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు గోసుకొండ వెంకటేష్ డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి అనుమతులను రద్దు చేయాలని కోరారు. శుక్రవారం చౌటుప్పల్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఫార్మా, కెమికల్ కంపెనీలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, రసాయన వ్యర్థాలు బయటకు విడుదల కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి..
కాలుష్య ప్రభావిత గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని గోసుకొండ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్యం కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పర్యావరణ ప్రభావాన్ని, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వినతిపత్రం అందిస్తామని తెలిపారు.

