కలం, స్పోర్ట్స్: ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తర్వాత తొలిసారి బాక్సింగ్ రింగ్‌లోకి దిగేందుకు ఇమానె ఖెలీఫ్ (Imane Khelif)సిద్ధమయ్యారు. డిసెంబర్ 15న పారిస్‌లో జరిగే ప్రొఫెషనల్ ఫైట్‌తో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నారు. 21 ఏళ్ల డచ్ బాక్సర్ క్లారిడా సరాబియాతో ఆరు రౌండ్ల పాటు తలపడనున్నారు. సరాబియా ఇప్పటివరకు ఆడిన నాలుగు ప్రొఫెషనల్ బౌట్లలోనూ ఓడిపోలేదు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల వెల్టర్‌వెయిట్ విభాగంలో ఖెలీఫ్ స్వర్ణం గెలిచారు. అయితే, ఆమె అర్హతపై అప్పట్లో వివాదం నెలకొంది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఆమెను సెక్స్ క్రోమోజోమ్ పరీక్షల ఆధారంగా అనర్హురాలిగా ప్రకటించింది.
ఒలింపిక్స్ తర్వాత ఆమె అధికారిక పోటీల్లో పాల్గొనలేదు. ఏప్రిల్‌లో జూలియా ఐగెల్‌తో జరగాల్సిన ఫైట్ కూడా గాయం కారణంగా రద్దయింది. ఇంతకాలం రింగ్‌కు దూరంగా ఉన్నా తిరిగి పోటీపడేందుకు శిక్షణ కొనసాగించినట్లు ఖెలీఫ్ తెలిపారు. ఇక 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొంటారా లేదా అన్నది స్పష్టత లేదు. బాక్సింగ్‌లో లింగ అర్హత పరీక్షలపై వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్షలు నిర్వహించే వరల్డ్ బాక్సింగ్‌పై ఖెలీఫ్ ఫిర్యాదులు కూడా చేశారు. పరీక్షలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలోనే జరగాలని ఆమె గతంలో పేర్కొన్నారు.

