కలం, వెబ్ డెస్క్ : NEET – Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పబ్లిక్ ఎగ్జామ్స్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, ఇతర పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.
ప్రధాని సూచనల మేరకు బిల్లులో చేర్చాల్సిన కీలక నిబంధనలపై అధికారులు సైతం విస్తృతంగా కసరత్తు జరిపినట్లు సమాచారం. పేపర్ లీక్ లకు పాల్పడిన వారిపై ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేస్తూ భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు, అలాగే కేసులలో వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాలను బిల్లులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సవరణల ప్రకారం,పేపర్ లీక్ లేదా పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే ఏకంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు, CJP ప్రతినిధులతో జరిగిన చర్చల్లో వచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సవరణ బిల్లును సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుతో పరీక్షల పారదర్శకతను పెంచడంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ఆ బిల్లులోని కొన్ని కీలక అంశాలు :
- పేపర్ లీక్ మాఫియాపై నిబంధనలు కఠినతరం
- ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు చట్టబద్ధత
- దర్యాప్తును పూర్తి చేసి, మూడు నెలల వ్యవధిలోనే తీర్పు వెలువరించాలి
- పేపర్ లీక్ కేసులలో గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష
- గరిష్టంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధన
Read Also: కేటీఆర్‌పై బ్యానర్‌పై విచిత్ర వాదన, పింకీస్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్
Follow Us On : WhatsApp

