కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వర్షాకాల (మాన్సూన్ సెషన్) సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రభుత్వాన్ని దుమ్ముదులుపుతామంటూ కేటీఆర్, హరీశ్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నిషేధిత భూముల (22-ఏ) జాబితాపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. అదే సమయంలో కమీషన్లకు కక్కుర్తి పడి ధరణి పేరుతో ప్రైవేటు పట్టా భూముల్ని సైతం నిషేధిత జాబితాలో చేర్చారనే అంశంపై బీఆర్ఎస్ను కాంగ్రెస్ టార్గెట్ చేయనున్నది.
ధరణి అమలైన కాలంలో ఎవరి భూములు ఈ జాబితాలో చేరాయో? ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయిందో? ఎన్ని ఎకరాల భూముల్ని టార్గెట్ చేశారో? ఏయే సర్వే నెంబర్లపై కన్ను వేశారో.. వీటన్నింటినీ ప్రభుత్వం ఏకరువు పెట్టాలనుకుంటున్నది.
మరోవైపు పాలిటెక్నిక్ విధానంలో మార్పులు, జీవో జారీ, ఫీజు రీయింబర్స్ మెంట్, కల్యాణలక్ష్మి స్కీమ్ అమలు.. ఇలాంటి అంశాలపైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ ముమ్మరంగా జరగనున్నది. ఏ ప్రభుత్వ హయాంలో ఏమేం? ఎలా? అమలయ్యాయో తేలుద్దామంటూ ముఖ్యమంత్రి బహిరంగంగానే సవాల్ విసిరారు.
కేసీఆర్‌పైనా వాడీవేడి చర్చ
ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తీరును తప్పుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వెయ్యి రోజుల్లో దాదాపు రూ.22.24 కోట్ల మేరకు ఆయన కోసం ప్రభుత్వం ఖర్చు చేసినట్లు లెక్కలు చెప్పారు. ప్రజల సమస్యలను ప్రస్తావించే బాధ్యత నుంచి తప్పుకున్న కేసీఆర్.. ఈ వెయ్యి రోజుల్లో ఎన్నిసార్లు సభకు వచ్చారంటూ సీఎం ఎత్తి చూపుతున్నారు.
బాధ్యతలు నిర్వర్తించని ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఎందుకంటూ విమర్శలు చేయడంతోనే సరిపెట్టుకోకుండా.. ఉద్యోగంలో చేరిన తర్వాత వెయ్యి రోజుల పాటు విధుల్లో లేనప్పుడు ఆ ఉద్యోగిని డిస్మిస్ చేయరా? అంటూ ప్రజల్లోనే చర్చకు తెరలేపారు. ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేస్తున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు రిజైన్ చేయరంటూ సీఎం కామెంట్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలన్న డిమాండ్‌తో ‘మహా ధర్నా’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇదే అంశం అసెంబ్లీలోనూ చర్చకు దారితీయనున్నది. కేసీఆర్ వ్యవహారాన్ని సీఎం ప్రస్తావిస్తే అది ఎటువైపు దారితీసి సభా కార్యక్రమాలు ఏ టర్న్ తీసుకుంటాయన్న చర్చ మొదలైంది.

