ఈజిప్ట్‌లో డేవిస్ కప్ సమరం.. భారత యంగ్ స్టార్స్ రెడీ!

కలం, స్పోర్ట్స్ : అఖిల భారత టెన్నిస్ సంఘం (All India Tennis Association) ప్రతిష్టాత్మక జూనియర్ డేవిస్ కప్ (Junior Davis Cup 2026) ఫైనల్స్ కోసం భారత జట్టును ప్రకటించింది. సోమవారం ప్రకటించిన జట్టులో హృతిక్ కటకం, రిభవ్ సరోహా, తవిష్ పహ్వా చోటు దక్కించుకున్నారు. ఈ టోర్నీ నవంబర్ 2 నుంచి 8 వరకు ఈజిప్ట్ రాజధాని కైరోలోని స్మాష్ స్పోర్టింగ్ క్లబ్‌లో జరగనుంది. 16 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న బాలుర కోసం నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పోటీలు తొలిసారి ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నాయి. గత పదేళ్లలో హంగేరీ, అమెరికా, టర్కీ, స్పెయిన్, చిలీ దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఇటీవల చిలీ రాజధాని శాంటియాగోలో క్లే కోర్టులపై పోటీలు జరిగాయి. ఈసారి కూడా క్లే కోర్టులపైనే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్మాష్ స్పోర్టింగ్ క్లబ్‌లో 2023 నుంచి వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ J500 టోర్నీలు నిర్వహిస్తున్నారు. జూనియర్ డేవిస్ కప్ ఫైనల్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా రీజినల్ క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించగా.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 బాలుర, 16 బాలికల జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. ఆతిథ్య దేశంగా ఈజిప్ట్ నేరుగా ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చెకియా, స్పెయిన్, ఫ్రాన్స్, హంగేరీ, ఇటలీ, జపాన్, కజకిస్తాన్, మొరాకో, సెర్బియా, అమెరికా, వెనిజులా జట్లు టోర్నీలో బరిలోకి దిగనున్నాయి. గత ఏడాది విజేతగా నిలిచిన అమెరికా డిఫెండింగ్ ఛాంపియన్‌గా తన టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగుతోంది.

దిగ్గజాలకు జూనియర్ డేవిస్ కప్ వేదిక

జూనియర్ డేవిస్ కప్‌లో గతంలో పాల్గొని సత్తా చాటిన పలువురు ఆటగాళ్లు ఆ తర్వాత ప్రపంచ టెన్నిస్‌లో దిగ్గజాలుగా ఎదిగారు. రాఫెల్ నాదల్, కార్లోస్ అలకరాజ్, ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్, జోవావో ఫోన్సెకా వంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడిన వారిలో ఉన్నారు. ఫైనల్స్‌లో తొలి మూడు రోజులు 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం ఒక రోజు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తారు. చివరి మూడు రోజుల్లో నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>