కలం, ఖమ్మం బ్యూరో : వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పింఛన్ల పెంపును అమలు చేయకపోతే ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తామని హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం పట్ల చూపిన చొరవ, నిబద్ధత తెలంగాణ ప్రభుత్వంలో కనిపించడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ‘వికలాంగుల హక్కుల సమితి’ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేస్తూ లబ్ధిదారులను వంచిస్తోందని, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా పూర్తిస్థాయి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వికలాంగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రభుత్వ మెడలు వంచుతామని, త్వరలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
పింఛన్లపై ఆధారపడే ప్రతి ఒక్కరూ రాబోయే పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ విహెచ్పిఎస్ కోర్ కమిటీ చైర్మన్ ఎల్.ఎల్. గోపాల్ రావు, జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం, పలువురు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

