కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పోరాటం తెలంగాణ ప్రభుత్వానికి కనబడటం లేదా అని సీపీఐ (CPI) కరీంనగర్ (Karimnagar) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) ప్రశ్నించారు.
అదే డిమాండ్‌పై కరీంనగర్‌లో వామపక్ష ఇతర విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి విద్యార్థి సంఘాల నేతలను అక్రమంగా, ముందస్తుగా ఆందోళన ప్రదేశాల్లో అరెస్టులు చేయిస్తుందని, సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇతర సంస్థల వారు చేపట్టిన నిరసనలపై జరిగిన లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాన్ని శ్రీనివాస్ ఖండించారు. అంతేకాకుండా నిరసన కారుల ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లో బుల్లెట్స్ ను దింపడం దుర్మార్గమని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఆందోళనను చూసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాని ఇంటి ముందు ఆందోళనకు దిగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై ఆందోళన చేసిందని, ఒక్క విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎందుకు అరెస్ట్ చేస్తుందో, ఉద్యమాలను ఎందుకు అణచివేస్తుందో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు బీజేపీ కనుసన్నల్లో పరిపాలన సాగుతుందని, కాంగ్రెస్ కేవలం కీలు బొమ్మలాగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌కు పిలుపునిస్తే ఎక్కడా కూడా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయలేదని, కేవలం కరీంనగర్‌లో మాత్రమే బీజేపీ నేతలు చెప్పినట్లు ఇక్కడి పోలీసులు నడుస్తున్నట్లుగా అనుమానం కలుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇక నుండైనా అక్రమ అరెస్టులు చేయవద్దని, విద్యార్థి సంఘాలు నిర్వహించే ఉద్యమాలు కేవలం విద్యార్థుల భవిష్యత్ కోసమే తప్ప స్వార్థ రాజకీయాలు చేయడానికి కాదనే విషయం పాలక ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని పంజాల శ్రీనివాస్ హితవు పలికారు.

