కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ వ్యాపంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ (PM Modi) 132వ ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోవడం ఇంధన సరఫరాకు సవాలుగా మారిందని వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే దశాబ్ద కాలంగా భారత్ నిర్మించుకున్న అంతర్జాతీయ సంబంధాల వల్ల ఇంధన సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల మార్చి నెల అంతర్జాతీయంగా అత్యంత కల్లోలభరితంగా మారిందని చెప్పుకొచ్చారు. కోవిడ్ తర్వాత ప్రపంచం కోలుకుంటుందని ఆశించిన వేళ ఈ యుద్ధాలు ప్రారంభం కావడం దురదృష్టకరమని చెప్పారు. యుద్ధం వల్ల కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలపై ప్రభావం పడిందని వెల్లడించారు. వారి భద్రతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ప్రధాని మోదీ వివరించారు. దీనికోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ క్లిష్ట సమయంలో 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయమని, ఇందులో స్వార్థ రాజకీయాలకు తావులేదని అభిప్రాయపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం వదంతులు వ్యాప్తి చేస్తూ దేశానికి నష్టం కలిగించొద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరారు. దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) స్పష్టం చేశారు.
Read Also: డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన విజయ్..!
Follow Us On: Facebook

