epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ ఎవరు కట్టాలి?

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం అప్పులు చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అసలు ఏ అప్పు లేని వ్యక్తిని కనుక్కోవడమే కష్టంగా మారింది. ఏదో ఒక కారణంతో చాలా మంది ఈ అప్పుల ఊబిలోకి దిగుతున్నారు. కొందరు సరైన ప్రణాళికతో బయట పడితే.. మరికొందరు పరిస్థితులు, అవసరాలు ఇలా ఏవేవో కారణాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పుల్లో ఎక్కువ మంది పర్సనల్ లోన్ (Personal Loan)  తీసుకునేవారే. అది అయితే కాస్తంత ఎక్కువ వస్తుందనేది కారణం కావొచ్చు. అయితే ఇలాంటి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే, ఆ రుణ భారం ఎవరి మీద పడుతుంది అనే ప్రశ్న చాలా కుటుంబాలను కలవరపెడుతోంది.

లోన్ స్వభావాన్ని బట్టి మార్పులు

ఈ విషయంలో ముందుగా పర్సనల్‌లోన్ (Personal Loan) స్వభావాన్ని అర్థం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ లోన్ అనేది సాధారణంగా ఎలాంటి ఆస్తి పూచీకత్తు లేకుండా ఇచ్చే అన్‌సెక్యూర్డ్ లోన్. అందువల్ల రుణగ్రహీత మరణించిన తర్వాత లోన్ చెల్లింపు బాధ్యత పరిస్థితులను బట్టి మారుతుంది. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్ మంజూరు సమయంలో క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా లోన్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తాయి. రుణగ్రహీత ఈ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే, అతని మరణం తర్వాత మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీనే బ్యాంక్‌కు చెల్లిస్తుంది. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. అందుకే పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం కుటుంబ భద్రతకు ఎంతో కీలకం అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్స్యూరెన్స్ చేయించుకోవడం ఉత్తమం

ఇన్సూరెన్స్ లేకుండా లోన్ తీసుకున్నట్లయితే పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఈ సందర్భంలో కుటుంబసభ్యులు తమ జేబు నుంచి తప్పనిసరిగా లోన్ చెల్లించాల్సిందే అన్న నియమం లేదు. కానీ రుణగ్రహీత పేరుపై ఆస్తులు ఉన్నట్లయితే, బ్యాంక్ ఆ ఆస్తులపై చట్టబద్ధంగా క్లెయిమ్ చేయవచ్చు. ఆస్తులను విక్రయించి, లోన్ మొత్తాన్ని రికవరీ చేస్తారు. మిగిలిన మొత్తం ఉంటే, అది చట్టబద్ధ వారసులకు అందుతుంది. లోన్‌కు కో అప్లికెంట్ ఉన్నట్లయితే బాధ్యత పూర్తిగా మారిపోతుంది. కో అప్లికెంట్ అంటే లోన్‌కు సంయుక్తంగా బాధ్యత వహించే వ్యక్తి. ప్రధాన రుణగ్రహీత మరణించినా, మిగిలిన లోన్ మొత్తానికి కో అప్లికెంట్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా లోన్‌కు గ్యారెంటర్ ఉంటే, బ్యాంక్ గ్యారెంటర్ నుంచి లోన్ రికవరీ చేసే హక్కు కలిగి ఉంటుంది.

ఆస్తులు లేకపోతే పరిస్థితి ఏమిటి?

అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఎలాంటి ఆస్తులు లేని పరిస్థితిలో, కో అప్లికెంట్ లేకుండా, గ్యారెంటర్ కూడా లేకపోతే, కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా తమ డబ్బులతో లోన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భాల్లో బ్యాంకులు లీగల్ నోటీసులు పంపినా, కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టపరంగా వారు వ్యక్తిగత బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రుణగ్రహీత మరణాన్ని పరిగణలోకి తీసుకుని, బ్యాంకులు లోన్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంతవరకు మాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా బ్యాంక్ పాలసీలు, లోన్ మొత్తం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే, పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో అన్ని నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవడం, లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. అలా చేస్తే అనుకోని పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా భద్రంగా ఉండగలుగుతారు. అప్పు తీసుకోవడం కన్నా, అప్పుతో పాటు బాధ్యతలను ముందే అర్థం చేసుకోవడమే నిజమైన ఆర్థిక అవగాహన అని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>