కలం, వెబ్ డెస్క్: ‘పెద్ది’ (Peddi Movie) సినిమా పర్సంటేజ్ వివాదం ఇంకా పూర్తిగా సమసిపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశం ముగిసిందని భావించినప్పటికీ, ఎగ్జిబిటర్ల తాజా నిర్ణయంతో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. పెద్ది సినిమాకు తమకు పర్సంటేజ్ కావాల్సిందేనంటూ ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు. ఈ మేరకు శనివారం వారు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమాకు తమకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎంత పర్సెంట్ ఇస్తారన్నది నిర్మాత తేల్చుకోవాలని సూచించారు. చాలా రోజులుగా ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ కావాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్ నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటం, కొన్ని సినిమాల విడుదల విధానం, అలాగే వసూళ్ల పంపకం పద్ధతిపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఓ తీర్మానం చేసినట్టు సమాచారం. అయితే ఎంత శాతం ఇవ్వాలనే విషయంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, దీనిపై నిర్మాతతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ వ్యవస్థపై మళ్లీ చర్చ మొదలైంది. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఈ అంశంపై ఒక సమగ్ర అంగీకారం అవసరమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

